తెలంగాణ

హెలికాప్టర్ రచ్చ.. సీఎం రేవంత్ రెడ్డితో ఇద్దరు మంత్రుల వార్!

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రచ్చ మొదలైందని తెలుస్తోంది. కేబినెట్ లోని కొందరు మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని సమాచారం. తీరు మార్చుకోవాలని ఇద్దరు మంత్రులకు సీఎం రేవంత్ క్లాస్ పీకారని అంటున్నారు. సీఎం తీరుపై ఆ మంత్రులు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారనే టాక్ వస్తోంది. కేబినెట్ లో ఇంత రచ్చకు హెలికాప్టర్ కారణమైందని చెబుతున్నారు.

రేవంత్ మంత్రివర్గంలోని కొందరు మంత్రులు సొంత జిల్లాల పర్యటనకు హెలికాప్టర్లలో వెళుతున్నారు.హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరమే అయినా హెలికాప్టర్ లో వెళుతుండటం.. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ గా మారుతున్నాయి. వంద కిలోమీటర్ల దూరం పోవడానికి హెలికాప్టర్ అవసరమా.. ప్రజా ధనం ఇలా దుర్వినియోగం చేస్తారా అన్న విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో అప్పుల్లో ఉందని చెబుతూ ఇలాంటి దుబారా ఖర్చులు ఎందుకనే చర్చ వస్తోంది. ఇదే సమయంలో ఇటీవల ఖమ్మం, మహబూబా బాద్ జిల్లాలు వరదలు ముంచెత్తాయి. ఖమ్మం నగర శివారులో ప్రకాశ్ నగర్ బ్రిడ్జీ పై నుంచి మున్నేరు ఉప్పొంగింది.

వరదల్లో ఏడుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. తమను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దాదాపు 16 గంటల పాటు వరదలోనే ఉన్నారు. ప్రాణాల అరచేతిలో పట్టుకుని ఉన్నారు. వాళ్లను రక్షించడానికి హెలికాప్టర్ తేవాలని స్థానిక ప్రజలు మంత్రులను ప్రాధేయపడ్డారు. కాని ముగ్గురు సీనియర్ మంత్రులు ఉన్నా హెలికాప్టర్ మాత్రం తీసుకురాలేకపోయారు. చివరికి ఓ జేసీబీ డ్రైవర్ ధైర్యంగా వరదలోకి వెళ్లి ఆ ఏడుగురిని రక్షించి తీసుకునచ్చారు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం వరద బాధితుల కోసం హెలికాప్టర్ ఎందుకు పంపలేదనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వచ్చేందుకు హెలికాప్టర్ లో మంత్రులు వెళుతున్నప్పుడు.. వరదల్లో చిక్కుకున్న ప్రజల కోసం ఎందుకు రాలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్య సాగింది. రేవంత్ సర్కార్ కు ఇది పెద్ద మైనస్ గా మారింది. హెలికాప్టర్ విషయంలో వివరణ ఇచ్చుకోవడానికి మంత్రులు ఇబ్బంది పడ్డారు.

ఈ ఘటన తర్వాత మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. నిజానికి గతంలో కేవలం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాత్రమే హెలికాప్టర్‌ను వినియోగించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఇదే ఆనవాయితీగా ఉండేది.. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతలు మాత్రమే చాఫర్‌ను వినియోగించేవారు.అప్పట్లో 300 నుంచి 400 కిలోమీటర్లు వరకు కూడా వారు రోడ్డు మార్గాన ప్రయాణించిన సందర్భాలు అనేకం. ఆ తర్వాత కేసీఆర్‌ కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు. కేవలం ఆదిలాబాద్‌, కాళేశ్వరం లాంటి పర్యటనకు మాత్రమే చాఫర్‌ సేవలు వాడేవారు. కేసీఆర్‌ కేబినెట్‌లోని మంత్రులు హెలికాప్టర్‌ వాడకం చాలా తక్కువనే చెప్పాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వంలోని కొందరు మంత్రులు విచ్చలవిడిగా హెలికాప్టర్‌ను వినియోగిస్తుండటం విమర్శల పాలవుతుంది.

కానీ రేవంత్ మంత్రివర్గంలోని కొందరు మంత్రులు కనీసం నెలలో ఒకటిరెండు సార్లు చాఫర్‌ను వాడుతున్నారట. తమ టూర్‌లలో ఎక్కువగా హెలికాప్టర్‌ ఉండేలా చూసుకుంటున్నారట. కొందరు మంత్రులు హెలికాప్టర్‌ సర్వీసులను సదరు మంత్రులు కావాలనే వినియోగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఓ కీలకమంత్రి నల్గొండలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష కోసం హెలికాప్టర్‌ను వినియోగించారు, రోడ్డు మార్గాన వెళ్లేందుకు అవకాశం ఉన్నప్పటికీ సదరు మంత్రి పట్టుబట్టి మరి హెలికాప్టర్‌ను తెప్పించుకున్నారట.మరోమంత్రి కూడా హెలికాప్టర్ లో వెళ్లి నాగార్జున సాగర్‌, మిర్యాల గూడలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు.సీఎం రేవంత్ రెడ్డిపై అక్కసుతోనే సదరు మంత్రులు ఇదంతా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

సీఎం కూర్చీకి గౌరవం ఇవ్వకుండా మంత్రులు హెలికాప్టర్ సేవలు వినియోగిస్తుండటంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు అధికారులు సీఎం రేవంత్‌ దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. దీంతో మంత్రులు హెలికాప్టర్ వాడకుండా నియంత్రించాలని సీఎస్‌ శాంతికుమారికి పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాలను చీఫ్ సెక్రటరీ శ మంత్రుల దగ్గర ప్రస్తావించినట్టు తెలిసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు మంత్రులు.. తాము తక్కువేమి కాదని.. తాము కూడా ముఖ్యమంత్రి అభ్యర్ధులమేనని తేల్చిచెప్పారట. రేవంత్‌కు మేమేమీ తక్కువ కాదని అన్నారట. మమ్మల్ని నియంత్రించాలని చూస్తే పరిస్థితులు మరోలా ఉంటాయని సీఎస్ ను హెచ్చరించారని తెలుస్తోంది. అవసరమైతే మా నియోజకవర్గాలకు సైతం హెలికాప్టర్లలో వెళ్తామని చెప్పడంతో సీఎస్ షాక్ అయినట్టు తెలిసింది.

Back to top button