అక్రమ కట్టడాలపై పంజా విసురుతున్న హైడ్రా మరింత స్పీడ్ పెంచింది. బడబాబులను వదలడం లేదు. మాదాపూర్ లోని హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది. తెల్లవారుజామునే బుల్జోజర్లతో ఎన్ కన్వెషన్ కు చేరుకున్న హైడ్రా అధికారులు.. హీరో నాగార్జునకు చెందిన భవనాన్ని కూల్చివేయడం ప్రారంభించారు.
తమ్మిడి చెరువును కబ్జా చేసి మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో యాక్షన్ లోకి దిగారు ఏవీ రంగనాథ్. అక్రమ కట్టడాలు ఎవరివైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
తమ్మిడి చెరువు FTL పరిధిలో అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ తో పాటు ఇతర కట్టడాలను తొలగించాలని జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు రోజుల క్రితం హైడ్రా కమిషర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. అన్ని ఆక్రమణలను తొలగించి 29 ఎకరాల 24 గుంటలకు పైగా ఉన్న చెరువును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పించారు.
ఒకప్పుడు జనానికి ఆహ్లాదం పంచిన తమ్మిడి చెరువు ఇప్పుడు అన్యాక్రాంతమైందని కసిరెడ్డి చెప్పారు. తమ్మడి చెరువులో హీరో నాగార్జున దాదాపు 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించి ఎన్ కన్వన్షన్ పేరుతో నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులో తెలిపారు. గతంలో లోకాయుక్త తోపాటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కసిరెడ్డి వెల్లడించారు. తమ్మిడి చెరువుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే హైడ్రా రంగంలోకి దిగింది.