జాతీయం

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ వెనుక కింగ్ మేకర్లు వీళ్లే..

హర్యానాలో గత చరిత్రను తిరగరాస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది, 1966 తర్వాత హర్యానాలో ఏ పార్టీ వరుసగా మూడు సార్లు అధికారంలోకి రాలేదు. ఈ ఎన్నికల్లో సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. హస్తం పార్టీనే గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా హర్యానా గెలిచామనే ధీమాలోనే ఉంది. కాని ఫలితాలు మాత్రం అంచనాలకు భిన్నంగా వచ్చాయి. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి కమలం పార్టీ విజయం సాధించింది. అయితే హర్యానాలో బీజేపీకి ఈ విజయం అంత ఆషామాషీగా రాలేదని తెలుస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అమలు చేసిన వ్యూహాల వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు.

హర్యానా ఎన్నికల్లో పార్టీకి గడ్డు పరిస్థితులు ఉన్నాయని ముందే గ్రహించిన సంఘ్ పెద్దలు.. 4 నెలల ముందుగానే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు దాదాపు 16 వేలకు పైగా సమావేశాలు నిర్వహించినట్టు సమాచారం. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. ఈ ప్రచారంతో జాట్‌ యేతర ఓట్లను కమలం పార్టీకి చేరువ చేసినట్టు ఫలితాల సరళితో తేలింది. అభ్యర్థుల ఎంపికలో ఆర్‌ఎస్‌ఎస్ సూచించిన వారికే టికెట్లు ఇవ్వడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చింది. ఇక హిందూ సమాజం సంఘటితంపై మోహన్ భాగవత్ పిలుపు కూడా సత్పలితాలు ఇచ్చిందని కమలం పార్టీ వర్గాలు అంటున్నాయి.తూర్పు, దక్షిణ హర్యానాలోని జాట్‌యేతర ప్రాంతాల్లో బీజేపీ తన బలాన్ని నిలుపుకున్నట్లు కనిపిస్తోంది. జాట్-ఆధిపత్యం ఉన్న పశ్చిమ హర్యానాలో ఇది చాలా బాగా పనిచేసింది. ఇక్కడ జాట్‌యేతర ఓట్లు బీజేపీకి పెద్ద సంఖ్యలో కలిసివచ్చినట్లు ఫలితాలను బట్టి అర్థమవుతోంది. ఇక కమలం పార్టీపై వ్యతిరేకతను గుర్తించడంలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైనట్టు తెలుస్తోంది. అటు భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జాల మధ్య అంతర్గత పోరు బీజేపీకి కలిసివచ్చిందని చెబుతున్నారు.

దేశంలో కాషాయపార్టీ కష్టకాలంలో ఉందంటే చాలు.. అక్కడికి వెంటనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు వాలిపోతారు. ఆర్‌ఎస్ఎస్‌ నేతలు ఒక్కసారి రంగంలోకి దిగితే పరిస్థితులన్నీ తారుమారు కావాల్సిందే. ఆ రేంజ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ప్రజల్లోకి వెళ్తారని ప్రచారముంది. ఇప్పుడు హర్యానాలో కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యినట్టు చెబుతున్నారు. ఆర్‌ఎస్‌ ఎస్‌ నేతలు హర్యానాలో జరగబోయే నష్టాన్ని ముందే గ్రహించి గ్రౌండ్‌లో దిగడంతో ఫలితాలన్నీ కమలం పార్టీకి అనుకూలంగా మారిపోయినట్టు కమల దళం భావిస్తోందట. మొత్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు రంగంలోకి దిగడంతోనే కమలం పార్టీ గెలుపు నల్లేరుమీద నడకగా మారిందని కమలం పార్టీ నేతలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button