క్రైమ్

హనుమాన్ దేవాలయం వద్ద మేక బలి.. మహేశ్వరంలో తీవ్ర ఉద్రిక్తత

సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటన మంటలు కొనసాగుతుండగానే మహేశ్వరం నియోజకవర్గంలో మరో ఘటన జరిగింది. వీర హనుమాన్ ఆలయం దగ్గర మేకను బలి ఇవ్వడం కలకలం రేపుతోంది. గుడి పక్కనే దర్గా ఉంది. ఆ దర్గావాళ్లే హనుమాన్ ఆలయం దగ్గర మేకను బలి ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. ఈ ఘటనకు నిరసనగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో వీర హనుమాన్ ఆలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి శ్రీ వీర హనుమాన్ దేవాలయం వద్ద ఈ ఘటన జరిగింది. దేవాలయం సమీపంలోని ఓ ముస్లిం దర్గాకు మేకపోతును బలి ఇచ్చారు కొందరు వ్యక్తులు. అయితే హనుమాన్ దేవాలయం సమీపంలోని ఇస్లామిక్ మతానికి సంబంధించిన దర్గాకు మేకను బలివ్వడాని వ్యతిరేకిస్తూ విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆందోళనకు దిగారు. జైశ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

హిందూ దేవాలయాల వద్ద మేకను బలి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని హిందూ సంఘాల నేతలు ప్రశ్నించారు. మేకను బలి ఇచ్చిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు వదిలేది లేదని విశ్వహిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు

Back to top button