
కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరు ఆ పార్టీలోనే దుమారం రేపుతోంది.సొంత పార్టీ కార్యకర్తను థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టి కొట్టించడంపై కాంగ్రెస్ కేడర్ రగిలిపోతోంది. సొంత పార్టీ కార్యకర్తను కొట్టించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన బండారి శ్రీనివాస్, పార్టీ మీద అసంతృప్తి కారణంగా 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నచ్చకపోవడంతో కొన్ని రోజులుగా ప్రజా సమస్యలను సోషల్ మీడియా వేదికగా ఎత్తి చూపుతున్నారు బండారి శ్రీనివాస్.
ఈనెల సెప్టెంబర్ 12న “మా ఊరికి వేయిస్తానన్న బస్సు ఏమైంది” అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు బండారి శ్రీనివాస్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిపల్లి సత్యం ఇచ్చిన హామీని గుర్తు చేశారు. దీంతో పోస్టు పెట్టిన మరుసటి రోజే.. ఆగస్టు 13న బండారి శ్రీనివాస్ ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించాడు మల్యాల ఎస్సై. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాలతో బండారి శ్రీనివాస్ ను చితక్కొట్టారు. 12 గంటల పాటు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టి కొట్టాడు. పోలీసుల టార్చర్ భరించలేక తాజాగా ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన బండారి శ్రీనివాస్. మరోసారి ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని మల్యాల ఎస్సై తనను బెదిరించాడని బండారి శ్రీనివాస్ చెబుతున్నాడు.