తెలంగాణ

సీఎం రేవంత్ సంచలనం.. ఈనెల 8 నుంచి పాదయాత్ర

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8 నుంచి పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 8న తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం యాదాద్రి జిల్లాలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో మూసీ పరివాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

మూసీ సుందరీకరణకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరునూరైనా చేసి తీరుతామని చెబుతున్నారు. తొలి దశలో గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సుందరీకరణ చేయడానికి ప్లాన్ సిద్దం చేశారు. అయితే మూసీ సుందీరకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చేస్తే ఊరుకునేది లేదని విపక్షాలు చెబుతున్నాయి. కమీషన్ల కోసమే లక్షా 50 వేల కోట్లతో మూసీ ప్రాజెక్ట్ చేపట్టారని ఆరోపిస్తున్నారు. విపక్షాలకు కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. మూసీ మురికితో నల్గొండ ప్రజలు చనిపోవాలా అని ప్రశ్నించారు. మూసీని సుందరీకరించి నల్గొండ రైతులకు మురికి నుంచి విముక్తి కల్పిస్తామని చెబుతున్నారు. మూసీ సుందరీకరణను వ్యతిరేకించే పార్టీలను నల్గొండ ప్రజలు తరిమికొట్టాలని చెప్పారు.

ఇటీవలే మూసీ సుందరీకరణ చేపట్టాలంటూ నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతులతో కలిసి ర్యాలీలు తీశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాదయాత్ర చేశారు. భువనగిరి, తుంగతుర్తి ఎమ్మెల్యేలు రైతులతో సమావేశం నిర్వహించి మూసీ సుందరీకరణ చేయాలని తీర్మానం చేశారు. ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డే రంగంలోకి దిగుతున్నారు. నల్గొండ రైతులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయనున్నారు. మూసీ సుందరీకరణను వ్యతిరేకించే పార్టీలను నల్గొండ రైతులు, ప్రజలతో తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button