తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గండం ఉందని.. 2025 జూలై లేదా డిసెంబర్ లో ఆయనను సీఎం పదవి నుంచి తప్పిస్తారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఈ విషయంపై గాంధీభవన్ లో చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ దూరం పెట్టారని.. ఇందుకు సంబంధించి తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని ఏలేటీ కామెంట్ చేశారు. మహేశ్వర్ రెడ్డి మాటలతో తెలంగాణలో మార్పులు జరగనున్నాయా.. సీఎం రేవంత్ రెడ్డిని మార్చేస్తారా.. మారిస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరూ అవుతారనే చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి.
ముఖ్యమంత్రి మార్పుపై ఏలేటీ మహేశ్వర్ రెడ్డి కామెంట్లపై రచ్చ సాగుతుండగానే.. ముఖ్యమంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన పొంగులేటి.. ఏలేటీ కామెంట్లపై స్పందించారు. రాబోయే నాలుగేళ్ల ఒక నెల కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే కొనసాగుతారన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే విజయమన్నారు. తమను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేది ఇందిరమ్మ ఇండ్ల పథకమే అన్నారు అయితే మళ్లీ గెలిచాకా రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని చెప్పలేదు పొంగులేటి. ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు కావాలనే ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు టీ కప్పులో తుఫాన్ లాంటివే అన్నారు.
ముఖ్యమంత్రి మార్పుపై మంత్రి పొంగులేటి చేసిన కామెంట్లు చర్చగా మారాయి. వచ్చే నాలుగేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పిన పొంగులేటి.. వచ్చే ఎన్నికల్లోనూ గెలుస్తామని చెప్పారు. కాని రేవంత్ రెడ్డే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మాత్రం చెప్పలేదు. ఇదే ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. తానే మరో పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. కాని పొంగులేటి మాత్రం అందుకు భిన్నంగా ప్రకటన చేయడం కాంగ్రెస్ లోనూ గుసగుసలకు కారణమైంది.