తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు డీఎస్సీ 2008 బాధితులు ఆందోళన చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఉదయాన్నే తరలివచ్చిన డీఎస్సీ బాధితులు.. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు శాంతియుతంగా నిరసనకు దిగారు. ఫిబ్రవరిలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని విన్నవించారు. మంగళ వారం కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి.. నియామక తేదీని ప్రకటించాలని కోరుతున్నారు బాధితులు. తమది ధర్నా కాదని విన్నపం మాత్రమే అని చెప్పారు 2008 డీఎస్సీ బాధితులు. ఇందుకు సంబంధించిన ఫ్లకార్డులు, పోస్టర్లను ప్రదర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎస్సీ 2008 బాధితులకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ డీఎస్సీ 2008 బాధితులకు ఉద్యోగాలు కల్పించింది. ఆ పద్దతిలోనే తాము కూడా ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ చెప్పారు. అంతేకాదు అధికారం చేపట్టిన వెంటనే ఈ అంశంపై అధికారులతో రివ్యూ చేశారు. ఫిబ్రవరిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ 2008 బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. కాని ఆరు నెలలు గడుస్తున్నా ఆ హామీ అమలు కాలేదు. మరోవైపు కోర్టులో వాదనలు తుది దశకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ గోడు వినిపించేందుకు వచ్చారు డీఎస్సీ 2008 బాధితులు.