అంతర్జాతీయం

భారత్ కు యూఎస్ ఉపాధ్యక్షుడు.. జేడీ వాన్స్ తిరిగే ప్రాంతాలు ఇవే..

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌ కు రానున్నారు. కుటుంబసమేతంగా ఆయన నాలుగు రోజులపాటు భారత్‌ లో పర్యటిస్తారు. నేటి నుంచి ఈ నెల24 వరకు ఆయన దేశంలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని పాలం వైమానిక స్థావరంలో దిగనున్న ఆయనకు కేంద్ర కేబినెట్‌లోని సీనియర్ మంత్రి స్వాగతం పలకనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన తొలుత ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం చేనేత ఉత్పత్తులను విక్రయించే దుకాణాల సముదాయాన్ని సందర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సాయంత్రం ఆరున్నరకు లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి వాన్స్ చేరుకుంటారు. చర్చల తర్వాత వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. రెండోరోజు జైపుర్‌లో చారిత్రక ప్రదేశాలను వాన్స్ దంపతులు సందర్శించనున్నారు. ఈనెల 23న ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించి తిరిగి జైపుర్‌కు చేరుకుంటారు. 24న తిరిగి అమెరికా వెళ్లనున్నారు.

అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ వాన్స్ భారత పర్యటనకు వస్తుండగా భారత్ ఈ రెండు అంశాలను ఆయనతో జరిగే చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత విద్యార్థుల వీసాల రద్దు అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. భారత విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ అమెరికా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది.

Back to top button