కృష్ణమ్మ మళ్లీ ఉప్పొంగింది. ఎగువన భారీగా కురుస్తున్న వర్షాలతో పాటు క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ అల్మట్టి నుంచి దిగువ నాగార్జున సాగర్ వరకు అన్ని డ్యాంలు నిండికుండలా ఉండటంతో.. వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. వరద పెరగడంతో ఇటీవలే క్లోజ్ చేసిన గేట్లను మళ్లీ తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు.
ఆదివారం వేళ పర్యాటకులకు ఆహ్లాదం అందించేలా నాగార్జున సాగర్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. శ్రీశైలం నుండి 64,699 క్యూసెక్కుల వరద నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వచ్చి చేరుతుంది. దీంతో నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.నాగార్జునసాగర్ డ్యామ్ యొక్క పూర్తి స్థాయినీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చెరుకుంది..టిఎంసిలలో నీటి నిల్వ సామర్థ్యం 312 టిఎంసిలు గాను ప్రస్తుతం 312 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.నాగార్జునసాగర్ డ్యాం నుండి కుడి,ఎడమ కాలువలకు,జంట నగరాల తాగునీటి అవసరాల కొరకు మొత్తం 64,699క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో వదుతున్నారు అధికారులు.
నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడం.. ఆదివారం కావడంతో పర్యాటకులు భారీగా వస్తున్నారు. దీంతో సాగర్ దారిలో వాహనాల రద్దీ కనిపిస్తోంది. ట్రాఫిక్ జాంలు కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నాగార్జున సాగర్ డ్యాం పరిసరాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. వరద పెరిగితే డ్యాం గేట్లు మరిన్ని తెరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.