తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగనుండటంతో గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా సర్పంచ్ స్థానాలకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఎలాగైనా గ్రామానికి సర్పంచ్ కావాలని కలలు గంటున్న లీడర్లు.. ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్దమవుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఎన్నికలు లేకుండానే సర్పంచ్ లను ఎన్నుకుంటున్నారు. వేలం పాట పాడుతున్నారు. వేలం పాట ద్వారా వచ్చే డబ్బులను గ్రామాభివృద్ది కోసం ఖర్చు చేస్తామని చెబుతున్నారు గ్రామస్తులు.
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడు గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం పాట జరిగింది. రూ.27.50 లక్షలకు వేలం పాటలో సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు భీమరాజు అనే వ్యక్తి. నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసేందుకు వేలంపాట వేసినట్టు సమాచారం. కానీ భీమరాజుకు ముగ్గురు పిల్లలు ఉండడంతో, ఎలక్షన్ రూల్ ప్రకారం అతనికి పదవి దక్కుతుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.