తెలంగాణ
Trending

వెయ్యి ఎకరాల్లో అతిపెద్ద భవనం.. హైదరాబాద్ చూసి షాక్ కావాల్సిందే..

హైదరాబాద్ అభివృద్ది, మహానగరం విస్తరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి కొత్త జూ పార్క్ లో ఉంచాలని, అర్బన్ ఫారెస్టీని అభివృద్ధి చేయాలని చెప్పారు. జామ్​ నగర్​ లో అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ప్రస్తావించారు. అలా ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలు, సంస్థలను కూడా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హెల్త్ సిటీలో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. వివిధ దేశాల నుంచి వచ్చే వారికి వైద్య సేవలందించే వన్ స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలని చెప్పారు. ఆన్ లైన్ లోనే అన్ని సేవల వివరాలను అందుబాటులో ఉంచాలని, నేరుగా ఎయిర్ పోర్ట్ నుంచి హాస్పిటల్ కు వెళ్లి, డాక్టర్ల అపాయింట్​మెంట్​, ట్రీట్మెంట్ తీసుకునేలా సదుపాయాలన్నీ ఉండాలని సూచించారు. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలని అన్నారు.

అనంతగిరి ప్రాంతంలో అద్బుతమైన ప్రకృతి అటవీ సంపద ఉందని, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బెంగుళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్​ నెస్​ సెంటర్ అక్కడ ఏర్పాటు చేయాలని చర్చించారు. వెల్​ నెస్​ సెంటర్ ఏర్పాటుకు జిందాల్ ప్రతినిధులు ఆసక్తిగా ఉంటే సంప్రదింపులు జరపాలని, ప్రకృతి వైద్య రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థలను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అచ్చంగా టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలావరకు అర్థంతరంగా ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. అలా ఆగిపోవడానికి వీల్లేదని, ఇప్పటివరకు ఏమేం అభివృద్ధి పనులు జరిగాయి.. ఇంకా ఏమేం అసంపూర్తిగా ఉన్నాయనే వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు. అక్కడికి వచ్చే భక్తుల సౌకర్యాలు, విడిది చేసేందుకు కాటేజీలు నిర్మాణాలకు దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అద్భుతంగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దాలని చెప్పారు.

ప్రస్తుతం కీసర గుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా.. అచ్చం అదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు. అక్కడ ఉపయోగించిన శ్యాండ్ బాక్స్ టెక్నాలజీ జోలికి వెళ్లవద్దని.. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర ఆలయం పునర్మిర్మాణం చేపట్టాలని సూచించారు.

రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్దికి కొత్త విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టూరిజంలో ముందంజలో ఉన్న ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకోవాలని, వాటిలో మెరుగైనవి, మన రాష్ట్రానికి అనువుగా ఉన్న వాటిని అనుసరించాలని సూచించారు. స్పీడ్‌ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) సమీక్షలో భాగంగా శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులతో సమావేశమయ్యారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టూరిజం ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిష్టియానా, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియల్ తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం అభివృద్ధికి విడివిడిగా పాలసీలను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఉన్న ప్రాచీన ఆలయాలు, చారిత్రక స్థలాలతో పాటు అటవీ ప్రాంతాలు, వైద్య సదుపాయాలన్నింటినీ పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రవాణాతో పాటు వసతి, పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయలు ఉండేలా కొత్త టూరిజం ప్యాకేజీలుండాలని చెప్పారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, కొన్ని చోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలన్నారు. పర్యాటకానికి అనువైన ప్రాంతాలన్నీ గుర్తించి, వేటిని ముందుగా అభివృద్ధి చేయాలనేది టూరిజం, దేవాదాయ, అటవీ శాఖ అధికారులు కలిసికట్టుగా నిర్ణయించాలని చెప్పారు.

కేవలం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తే సరిపోదని, హరిత హోటళ్లు, వసతి గృహలు నిర్మించి వదిలేస్తే సరిపోదని, నిరంతరం వీటి నిర్వహణ మెరుగ్గా ఉంటేనే పర్యాటకులను ఆకర్షిస్తాయని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. అందుకే కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించారు. అటు ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా టూరిజం అభివృద్ధి జరగాలని సీఎం స్పష్టం చేశారు.

Back to top button