తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ కేడర్ రోడ్డెక్కడం చర్చగా మారింది.
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కమాన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసమైంది. అక్కడ కట్టిన పెద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీ కూలడం వల్లే ఎన్టీఆర్ విగ్రహం ఎడమ చేయి విరిగిపోయింది. దీంతో టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగారు.
గత నెల ఆగస్టు 30న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నూతన మేయర్ అమర్ సింగ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాత్రి గాలివానకి ఎన్టీఆర్ విగ్రహం పై పడింది కాంగ్రెస్ ఫ్లెక్సీ. దీంతో ఎన్టీఆర్ చేయి విరిగి కిందపడింది.
ఎన్టీఆర్ విగ్రహం వద్దకి వచ్చిన టిడిపి శ్రేణులు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ని అవమానించే విధంగా కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సిని ఏర్పాటు చేశారని చెప్పారు. కట్టవద్దని చెప్పినా వినలేదని.. ఇప్పుడు విగ్రహం విరిగిపోయిందని ఆరోపించారు. ఎన్టీఆర్ విగ్రహంపై పడిన ఫ్లెక్సీ కట్టిన వారిపై పోలీసులు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.