కుండపోత వర్షం, బుడపేరు వాగు పొంగడంతో జలమలమైన విజయవాడు ఇప్పట్లో తేరుకునేలా కనిపించడం లేదు. నాలుగు రోజులు వర్షం తెరపి ఇవ్వడం.. కృష్ణ్మమ్మ శాంతించడంతో సహాయ చర్యలు యుద్ద ప్రాతిపదికన జరిగాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో మళ్లీ వర్షం మొదలైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి నగరంలో వర్షం కురుస్తోంది. దీంతో విజయవాడ ప్రజలు వణికిపోతున్నారు. సహాయచర్యల్లో ఉన్న అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు ముంచుకొస్తోంది. పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఎఫెక్ట్‌తో నేటి నుంచి ఈ నెల 9వ వరకూ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పల్నాడు, ఏలూరు, ఎన్‌టిఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వరదలు ఇంకా తగ్గకపోవడం, మళ్లీ భారీ వర్ష సూచన చేయడంతో విజయవాడ వాసులు ఇండ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ప్రభుత్వ సహాయక బృందాలతో సంబంధం లేకుండా తమ సొంత ప్రయత్నాలు చేసుకుంటూ పిల్లాపాపలు, విలువైన వస్తువులను తీసుకుని తమ బంధువల దగ్గరకు వెళుతున్నారు. రెండు రోజుల్లో నగరం నుంచి వేలాది నంది వెళ్లిపోయారని చెబుతున్నారు. వరద తీవ్రతకు అల్లాడిన సింగ్ నగర్ చాలా వరకు ఖాళీ అయింది. వరద తగ్గి ఇండ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి ఉన్న ప్రజలంతా తమ దారి తాము చూసుకుంటున్నారు. బుడమేరు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తుందన్న వార్తలు నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.