కుండపోత వర్షం, బుడమేరు వాగు పొంగడంతో నీట మునిగిన విజయవాడ ఇంకా తేరుకోలేదు. సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ యంత్రాంగమంతా నిరంతరం శ్రమిస్తున్నా ఇంకా వందలాది కాలనీలు మోకాళ్ల లోతు నీటిలోనే ఉన్నాయి. కృష్ణమ్మ శాంతించడంతో నగరంలోనూ వరద వేగంగా తగ్గుతుందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ సంతోషం ఎక్కువ సేపు మిగల్లేదు. విజయవాడ సహా కృష్ణా జిల్లాలో మళ్లీ వర్షం మొదలైంది. నాలుగు రోజుల క్రితం కుండపోత వర్షం కురిసిన ప్రాంతాల్లోనే మళ్లీ వర్షం కురుస్తోంది.
Read More : మళ్లీ కుండపోత వర్షం.. వణుకుతున్న జనం
తాజా వర్షాలు విజయవాడ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అయిన విజయవాడలో మరోసారి వర్షం పడుతోంది. అర్థరాత్రి నుంచి మళ్లీ వర్షం కురుస్తోంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు బెంబెలెత్తి పోతున్నారు. వరద ఉధృతి తగ్గినా విజయవాడ నగరం ముంపులోనే ఉంది. మూడు రోజులుగా వేల మంది ప్రజలు జలదిగ్భంధంలోనే ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ సిబ్బంది..డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. మళ్లీ వర్షాలు పడుతుండటంతో నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
Read More : రేవంత్ సంచలనం.. మున్సిపాలిటీల్లో ORR 51 గ్రామాలు విలీనం
మరోసారి వర్షం పడటంతో మళ్లీ వరదలు వస్తే తమ పరిస్థితి ఏంటని విజయవాడు వాసులు బెంబెలెత్తిపోతున్నారు. గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.