ఆంధ్ర ప్రదేశ్

విజయవాడకు పెను గండం.. వణుకుతున్న లంక గ్రామాలు

విజయవాడ నగరానికి భారీ వరద ముప్పు ముంచుకొస్తోంది. కృష్ణానదికి 5.5 లక్షలు క్యూసెక్కులు వరద రానుంది.మునేరు వాగు నుంచి ఆకస్మిక వరద నీరు వచ్చి చేరే పరిస్థితి ఉంది. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టు ఔట్ ఫ్లో 4,94,152 క్యూసెక్కులుగా ఉంది. విజయవాడ ప్రకాశం బ్యారేజికి భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుండి 5 లక్షల క్యూసెక్కులు, మునేరు, కట్లేరు ఇతర వాగుల నుండి 1 లక్ష క్యూసెక్కులు కలిసి 6 లక్షల క్యూసెక్కులు వరకు వచ్చే అంచనా. ప్రకాశం బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

ఆదివారం ఉదయం ఐదు గంటలకు ప్రకాశం బ్యారేజ్ ఔట్ ఫ్లో 5,55,260 క్యూసెక్కులుగా నమోదైంది. కే కొత్తపాలెం, పల్లెపాలెం, ఆముదార్లంకలకు వరద ముప్పు ఉందని అధికారులు చెబుతున్నారు. ఆయా లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తీర ప్రాంత మండలాల్లో రెవిన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాలువలు,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని.. పడిపోయిన విద్యుత్ లైన్లకు,స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమ్తతం చేసింది.

ఇక కళింగపట్నం వద్ద తీరం దాటింది వాయుగుండం. వాయువ్య దిశగా పయనిస్తోంది. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర-దక్షణ ఒడిస్సా మీదుగా చత్తీస్ గడ్-తెలంగాణ వైపు పయనించనుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Back to top button