తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పుట్టినరోజున యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. యాదాద్రి ఆలయంలో పూజల అనంతరం తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేశారు. వలిగొండ మండలంలో మూసీ పరివాహాక రైతులతో కలిసి దాదాపు 3 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు హంగామా చేశాయి. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ కలిసి నడిచారు. కాని అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనిపించకపోవడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది.
యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బడా నేత రాజగోపాల్ రెడ్డే. గతంలో భువనగిరి ఎంపిగా పని చేసిన రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించిన భువనగిరి ఎంపిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించారు. జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న రాజగోపాల్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన పాదయాత్రకు డుమ్మా కొట్టడం చర్చగా మారింది. సీఎం పర్యటనకు రాజగోపాల్ రెడ్డి హాజరుకాకపోవడంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
అమెరికాకు వెళ్లారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి.అయితే కావాలనే ఆయన సీఎం పర్యటనకు డుమ్మా కొట్టారా అన్న చర్చ సాగుతోంది.మంత్రి పదవి ఇవ్వడం లేదని పార్టీపై అలిగారని.. అందుకే అమెరికా వెళ్లారని అంటున్నారు. భువనగిరి ఎంపీగా చామలను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మాట మార్చారనే ఆగ్రహంలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారంటున్నారు.అందుకే రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనకుండా అమెరికా వెళ్లిపోయారని చెబుతున్నారు.
రాజగోపాల్ రెడ్డి డుమ్మాకు సంబంధించి మరో చర్చ కూడా సాగుతోంది. సీఎం రేవంత్ పర్యటనకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హల్ చల్ చేశారు. తమ్ముడు రాకున్నా వెంకట్ రెడ్జి హంగామా చేయడంపైనా చర్చ సాగుతోంది. రాజగోపాల్ రెడ్డి సీఎం పర్యటనకు దూరంగా ఉండటానికి వెంకట్ రెడ్డి కూడా కారణమనే వాదన కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తోంది. మంత్రి పదవి విషయంలో అన్నదమ్ముల మధ్య గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే వెంకట్ రెడ్డిని తొలగించాల్సి ఉంటుందని హైకమాండ్ చెప్పిందట. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి కేబినెట్ లో చోటు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిందట. అయితే వెంకట్ రెడ్డి మాత్రం మంత్రి పదవి తనకే కావాలని స్పష్టం చేశాడట. దీంతో రాజగోపాల్ రెడ్డి కేబినెట్ బెర్త్ విషయంలో సీఎం రేవంత్ చేతులెత్తేశారట. అందుకే అన్న వెంకట్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి గుర్రుగా ఉన్నారని అంటున్నారు.