తెలంగాణ

రేవంత్ చెప్పినా డోంట్ కేర్..హెలికాప్టర్‌లోనే నల్గొండకు కోమటిరెడ్డి

ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనే ఆరోపణలు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినా తన తీరు మార్చుకోవడం లేదు. నేను అనుకున్నది చేస్తానంటూ చేసేస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శుక్రవారం మరోసారి నల్గొండకు హెలికాప్టర్ లో వెళుతున్నారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు నుంచి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకొండ పర్యటనకు హెలికాప్టర్ లో వెళుతున్నారు కోమటిరెడ్డి. ఇదే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

తెలంగాణలో మంత్రులు హెలికాప్టర్లు వాడటం పెద్ద చర్చగా మాపుతోంది. శుక్రవారం నాడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పర్యటనకు హెలికాప్టర్ లో వెళ్లనున్నారు. సాధారణంగా వరదలు, విపత్తుల సమయంలో సీఎం, మంత్రులు హెలికాప్టర్లు వాడుతుంటారు. సిటీకి 2,3 వందల కిలోమీటర్ల దూరంలో ఉండే నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు వెళ్లాలంటే హెలికాప్టర్లను వాడొచ్చు కానీ.. పక్కనే ఉన్న నల్గొండ లాంటి జిల్లాలకు వెళ్లినా కూడా మంత్రులు హెలికాప్టర్లను వాడటంపై చర్చ జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ప్రస్తుతం తమ పర్యటనలకు హెలికాప్టర్లను వాడుతున్నారు.

కేసీఆర్ హయాంలో అప్పటి గవర్నర్ కు కూడా కొన్నిసార్లు హెలికాప్టర్ అందుబాటులోకి రాలేదని కొంతమంది నేతలు చెబుతుంటారు. కేవలం గంట, రెండు గంటల్లో వెళ్లే వీలున్న నల్గొండ లాంటి జిల్లాలకు మంత్రులు హెలికాప్టర్ వాడాల్సిన అవసరం ఉందా అని కొన్ని వర్గాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వ అవసరాలకు హెలికాప్టర్ వాడాల్సి వస్తే రెంట్ కు తీసుకొస్తుంటారు. మంత్రులకు అడిగిన వెంటనే హెలికాప్టర్లు ఇవ్వడం కరెక్టేనా అన్న చర్చ జరుగుతోంది.

ఇటీవలే తాండూరు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు మంత్రి కోమటిరెడ్డి మరికొంత మంది నేతలను తీసుకుని హెలికాప్టర్ లో వెళ్లారు. తాండూరు నగరానికి అతి సమీపంలోనే ఉంటుంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇటీవలే ఖమ్మంలో మున్నేరు వాగు పొంగింది. వరదలో జనాలు చిక్కుకుపోయారు. వాళ్లను కాపాడటానికి హెలికాప్టర్ తీసుకురావాలని స్థానికులకు మంత్రులను కోరారు. కాని హెలికాప్టర్ మాత్రం రాలేదు. హెలికాప్టర్ కోసం చూస్తూనే ఓ కుటుంబం వరదలో కొట్టుకుపోయింది. ఓ జేసీబీ డ్రైవర్ ప్రాణాలకు తెగించి 9 మందిని కాపాడారు. వరదల సమయంలో హెలికాప్టర్ రాకపోవడంపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మంత్రుల జల్సాలకు వచ్చిన హెలికాప్టర్లు.. వరదల నుంచి జనాన్ని కాపాడటానికి ఎందుకు రాలేదనే విమర్శలు వచ్చాయి.

సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంపై హెలికాప్టర్ వాడకంపై సీఎస్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారట. మంత్రులకు హెలికాప్టర్ ఇవ్వొద్దని ఆదేశించారట. అయితే మంత్రులు మాత్రం తమకు హెలికాప్టర్ కావాల్సిందేనని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను మంత్రులకు సీఎస్ చెప్పినా వాళ్లు వినడం లేదట. తాము సీఎంకు తక్కువేమి కాదని.. తాము అడిగినప్పుడు హెలికాప్టర్ ఇవ్వాల్సిందేనని సీఎస్ కు స్పష్టం చేశారట. మంత్రుల తీరుతో సీఎస్ షాకయ్యారని చెబుతున్నారు. తాము కోరుకున్న సీఎం పదవి దక్కలేదనీ.. కనీసం హెలికాప్టర్ పర్యటనలకు కూడా అనుమతి ఇవ్వరా అని అధికారులను మంత్రులు కోరుతున్నట్టు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button