లగచెర్ల ఫార్మా రగడ.. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై తనదైన శైలిలో స్పందించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. పాలనలో కేసీఆర్ ను మించిన నియంతలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల పైశాచిక పాలనలో BRS రైతులను మల్లన్నసాగర్ గురించి అర్ధరాత్రి అరెస్టు చేశారని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కూడా రైతులను అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. మారింది కేవలం రంగుల జెండా మాత్రమేనని రైతుల బతుకుల్లో మార్పు లేదని రఘునందన్ రావు అన్నారు.
నిజంగా ఫార్మా సిటి నిర్మించాలంటే గత ప్రభుత్వం సేకరించిన భూములలో ఏర్పాటు చేయవచ్చు.. కానీ వాటిని ఫార్మా కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. పాత ముఖ్యమంత్రి చేసిన తప్పులనే రేవంత్ చేస్తున్నారని.. గత ప్రభుత్వంలో గజ్వేల్ కు గడ సంస్థ పెట్టుకుంటే రేవంత్ కొడంగల్ కోసం కడ సంస్థ పెట్టుకున్నారని విమర్శించారు. ఖమ్మం మిర్చి యార్డు లో నాడు రైతులను అరెస్టు చేసి బేడీలు వేసినప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మల్లన్న సాగర్ నిర్వాసితుల దగ్గర ధర్నా చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు.
తప్పు చేసినోళ్లు ఎవరైనా సరే చట్టం ముందు సమానమే అన్నారు రఘునందన్ రావు. ఎన్నో ఫార్మా కంపెనీలు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయని.. గతంలో సేకరణ చేసినటువంటి భూములను తమకు అందిస్తే అన్ని కంపెనీలను ఒకే చోట ఏర్పాటు చేస్తామని చెప్పినా ఈ ప్రభుత్వం వినిపించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా ఒకరు ఢిల్లీలో ఒకరు బొంబాయిలో కూర్చొని మాట్లాడుతున్నారని చెప్పారు. అసలు వీళ్ళిద్దరూ చర్లపల్లి లో ఉండాల్సినటువంటి వాళ్లని హాట్ కామెంట్స్ చేశారు రఘునందన్ రావు. ఇందులో ఒకరు ముందుగానే చర్లపల్లి వెళ్లిన వాళ్ళు ఉంటే..ఇప్పుడు ఇద్దరు కలిసి చర్లపల్లి జైలులో కూర్చోవాలని అన్నారు. మళ్లీ మేమే రాబోతున్నాం మేమే చేస్తున్నాం అని చెప్పుకున్న ఇరు పార్టీలు తమ గొప్పలను ప్రదర్శించకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు.