హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగు చూసింది. 300 కోట్ల రూపాయలతో బోర్డు తిప్పేసిన ఘటన సంచలనం రేపుతోంది. కూకట్‌పల్లి కేంద్రంగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో బడా మోసానికి పాల్పడ్డారు. 8లక్షల 8వేలు కనీస పెట్టుబడిగా పెట్టి రెండు గుంటల స్థలాన్ని కొనుగోలు చేసిన వారికి 25 నెలలపాటు ప్రతి నెలా 4 శాతం చొప్పున అంటే నెలకు 32 వేలు చెల్లిస్తామని 12 వెల్త్ సంస్థ నమ్మించింది. అలా ఏకంగా వందల కోట్లు కొల్లగొట్టింది.
ఈ స్కీమ్‌లో మరెవరినైనా చేర్పించిన వారికి 25 నెలలపాటు ప్రతి నెలా 7 వేల 200 రూపాయల చొప్పున చెల్లిస్తామని ఆశ చూపారు. అలాగే డబుల్ గోల్డ్ స్కీమ్‌లో కనీసం 4 లక్షలు పెట్టుబడి పెడితే 12 నెలల తరువాత వారికి 8 లక్షల విలువ చేసే స్విట్జర్లాండ్ గోల్డ్ బిస్కెట్ ఇస్తామని ట్రాప్ చేశారు. గోల్డ్ చిట్ స్కీమ్ పేరుతో బాధితులకు మరో వల విసిరిందీ సంస్థ. 5 లక్షలు 20 నెలలపాటు పెట్టుబడిగా పెడితే 19 నెలలపాటు నెలకు 15 వేల చొప్పున ప్రతి నెలా చెల్లిస్తామని.. 20వ నెల మరో 15 వేలు అదనంగా చెల్లిస్తామని కేటుగాళ్లు నమ్మించారు. వీరి మాటలు నమ్మి 3వేల 600 మంది భారీఎత్తున పెట్టుబడి పెట్టారు.
డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత తిరిగి నగదు, బంగారం ఇవ్వకపోవడంపై బాధితులు సైబరాబాద్ EOW పోలీసులను ఆశ్రయించారు. దీంతో 300 కోట్ల రూపాయల మోసం బట్టబయలు అయ్యింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కలిదిండి పవన్ కుమార్ సహా మొత్తం 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వల్లభనేని రవికుమార్ చౌదరి, కాకర్ల గిరిబాబు ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే 12 వెల్త్ సంస్థ అనుచరులు బాధితులపై బెదిరింపులకు దిగారు. పోలీసులను ఆశ్రయించిన వారిని భయాందోళనకు గురి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు ఇవ్వమంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.