
కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్ లో విచిత్రం జరుగుతోంది. కాలనీ ప్రధాన చౌరస్తాలోని శ్రీ వివేకానంద విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లు రాత్రి పూట వెలగడం లేదు. రాత్రి ఏడు అయితే ప్రధాన చౌరస్తా మొత్తం చిమ్మచీకటిగా మారిపోతుంది. అయితే రాత్రి వెలగని వీధి లైట్లు.. పట్ట పగలు మాత్రం బ్రహ్మాండంగా వెలుగుతున్నాయి. రాత్రి వెలగాల్సిన లైట్లు పగలు వెలుగుతుండటం చూసి కాలనీ వాసులు.. ఇదేం చోద్యమని అవాక్కవుతున్నారు.
కాలనీ ప్రధాన రోడ్డుల్లో రాత్రివేళ స్ట్రీట్ లైట్లు వెలగక అనేక సమస్యలు వస్తున్నాయి. చీకట్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా రోజులుగా ఇలా జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అసొసియేషన్ పెద్దలు, అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా స్పందించడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కాలనీ మెయిన్ సెంటర్ లో రాత్రి పూట వీధి లైట్లు వెలగకపోయినా ఎందుకు బస్తీ లీడర్లు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులైనా వెంటనే స్పందించి వీధి లైట్ల సమస్యను పరిష్కరించాలని శ్రీ వివేకానంద నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.