రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతకు పోలీసులు షాకిచ్చారు. కారును సీజ్ చేశారు.కారు నెంబర్ ప్లేట్ పై తన పేరు రాసుకున్న మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ కుమారుడు శ్రావణ్ వాహనాన్ని నార్సింగి పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. మణికొండ ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు..
ఆయన కొడుకు శ్రావణ్ తన కారుపై నంబర్ ప్లేట్ కు బదులుగా తన పేరు రాసుకొని కొన్ని రోజులుగా తిరుగుతున్నాడు.ఈ విషయం నార్సింగి పోలీసుల దృష్టికి వెళ్లడంతో వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నేతలు నిబంధనలను పాటించాల్సింది పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపామని నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. విచారణ జరపగా సదరు వాహనం కస్తూరి టీం కే.ఎన్.ఆర్ పై రిజిస్ట్రేషన్ అయి ఉందని పేర్కొన్నారు. వాహనాన్ని సీజ్ చేసి కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టినట్లు నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి వివరించారు..