కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాత్రి పొద్దుపోయాక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని మారుమూల గ్రామమైన నెల్వలపల్లికి విచ్చేశారు. తన స్నేహితుడు, అనేక సేవా కార్యక్రమాల్లో ముందున్న ప్రముఖ కన్ స్ట్రక్షన్ అధినేత రవిగుప్తా తండ్రి, మాజీ సర్పంచ్ బూరుగు పెద్ద మల్లయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తండ్రి జ్ఝాపకార్ధం నిర్మించిన విగ్రహానికి నివాళులు అర్పించారు. కరోనా కాలంలో రవిగుప్తా చింతపల్లి మండలంలో పెద్ద ఎత్తున ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మండలంలో అనేక సేవా కార్యక్రమాల్లో ముందున్నారు.
వివిధ కార్యక్రమాల్లో ఈరోజు బండి సంజయ్ బిజీబిజీగా ఉన్నప్పటికీ మిత్రుడు రవిగుప్తా కోసం రాత్రి పొద్దుపోయినప్పటికీ నెల్వలపల్లి గ్రామానికి విచ్చేశారు. బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడిత మనోహర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధి జె.సంగప్ప, లంకల దీపక్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగవర్షిత్ రెడ్డి తదితరులు ఆ గ్రామానికి వచ్చారు. అయినప్పటికీ బండి సంజయ్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో, కోలాటలతో మహిళలు స్వాగతం పలికారు. ఊరు ప్రజలంతా బండి సంజయ్ కోసం రాత్రి పొద్దుపోయే వరకు ఎదురు చూశారు. సంజయ్ రాగానే జై శ్రీరాం, జై బీజేపీ, జైజై బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. అందరికీ ఒకవైపు అభివాదం చేస్తూనే.. మరోవైపు ఓపికగా బండి సంజయ్ ఫోటోలు దిగారు. బీజేపీ కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు.