దేశంలో అత్యంత కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జార్ఖండ్ కు సంబంధించి ఈనెల 13న తొలి విడత పోలింగ్ జరగగా.. ఇవాళ మహారాష్ట్రతో పాటు రెండో విడత పోలింగ్ జరుగుతోంది.
మహారాష్ట్రలోని మొత్తం 288 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది.
మహారాష్ట్ర ఎన్నికలను ఎన్డీఏ, ఇండి కూటమి సవాల్ గా తీసుకున్నాయి. ఎన్నికల్లో విజయం కోసం అధికార మహాయుతి కూటమి, విపక్ష మహా వికాస్ అఘాడీ హోరాహోరీ తలపడ్జాయి. మహాయుతి కూటమి తరపున బీజేపీ 149 స్థానాల్లో, శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహా వికాస్ అఘాడీ తరపున కాంగ్రెస్ 101 స్థానాల్లో, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం 95 స్థానాల్లో, ఎన్సీపీ వరద్ పవార్ వర్గం 86 స్థానాల్లో బరిలో ఉన్నాయి. పోలింగ్ కోసం మహారాష్ట్ర వ్యాప్తంగా 1,00,186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జార్ఖండ్‌లో రెండో, ఆఖరి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 13న తొలి విడతలో 43 సీట్లలో పోలింగ్ జరిగింది. జేఎంఎం సారథ్యంలోని పాలక ఇండియా కూటమిని ఎలాగైనా ఓడించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణం పట్టుదలగా ఉంది. నవంబరు 23న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
మహారాష్ట్ర, జార్కండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. దీంతో మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మహారాష్ట్రలో విజయంపై రెండు కూటములు ధీమాగా ఉన్నాయి. ముస్లిం, క్రిస్టియన్, దళిత్ ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని.. తప్పకుండా గెలుస్తామనే ధీమాలో కాంగ్రెస్ కూటమి ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కూటమి 27 సీట్లు సాధించి ఆధిపత్యం చూపించింది. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదని.. తమకు గెలుపు ఖాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. చూడాలి మరీ ఎగ్జిట్ పోల్స్ లో ఏ కూటమికి ఎడ్జ్ ఉంటుందో.. కౌంటింగ్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయో..