మంచు కుటుంబంలో హైడ్రామా కొనసాగుతోంది.మంగళవారం సాయంత్రం జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గర జరిగిన గొడవకు సంబంధించిన పోలీసుల విచారణ సాగుతోంది. రాచకొండ పోలీసుల ఇచ్చిన నోటీసులతో మంచు బ్రదర్స్ వేరువేరుగా విచారణకు హాజరయ్యారు. నేరెడ్ మెట్ లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి మధ్యాహ్నం మంచు మనోజ్ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంట సేపు సీసీ సుధీర్ బాబు వివిధ అంశాలపై మనోజ్ ను ప్రశ్నించారు. రాత్రి 8 గంటల తర్వాత సీపీ కార్యాలయానికి వచ్చారు మంచు విష్ణు. ఆయనను కూడా దాదాపు గంట సేపు సీపీ సుధీర్ బాబు ప్రశ్నించారు.
మంచు సోదరులను వేరువేరుగా ప్రశ్నించిన సీపీ.. గట్టి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. మనోజ్, విష్ణును నిలబెట్టే ప్రశ్నించారు సీపీ. నాలుగు రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై ఆరా తీశారు. మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంచు సోదరులకు సీపీ సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చారు.
ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లపైనా ప్రశ్నించారు సీపీ. ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని ఆదేశించారు. జల్‌పల్లి నివాసంలో ఉన్న ప్రైవేటు సెక్యూరిటీని పంపించి వేయాలని విష్ణుకు స్పష్టం చేశారు. జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో బాండ్ పేపర్ల పై మనోజ్, విష్ణు సంతకాలు తీసుకున్నారు సీపీ. పోలీసుల విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్.. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి తాను సిద్దమని చెప్పారు. మంచు విష్ణు మాత్రం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు .