తెలంగాణలో హైడ్రా జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. చెరువుల్లో కట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. మాదాపూర్ తుమ్మిడికుంట చెరువులో నిర్మించిన హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లోని అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. అక్రమ నిర్మాణాలు ఎవరివి ఉన్నా కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మెడికల్ కాలేజీలోని చెరువు బఫర్ జోన్ లో కట్టారంటూ కేసు నమోదు చేశారు. ఇక హైడ్రా నెక్స్ టార్గెట్ మాజీ మంత్రి మల్లారెడ్డే అనే చర్చ సాగుతోంది. మల్లారెడ్డికి చెందిన కాలేజీలు చెరువు భూముల్లో కట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో హైడ్రా బుల్డోజర్లు మల్లారెడ్డి కాలేజీల వైపు వెళ్లనున్నాయనే టాక్ నడుస్తోంది.
హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గత 25 ఏళ్ల నుంచి ఎలాంటి అక్రమాలు చేపట్టలేదని చెప్పారు. గాయత్రి ట్రస్ట్, అనురాగ్ సంస్థలు అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులు తన యూనివర్శిటీలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణం ల్యాండ్ కనవర్శన్ చేసుకుని నిర్మించామన్నారు. కక్ష పూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందన్నారు.
బఫర్ జోన్ లో అనురాగ్ యునివర్సిటీ నిర్మించారని ప్లలాపై కేసు నమోదు అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్ లో నిర్మించారని పోచారం పీఎస్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు. బఫర్ జోన్ లో యూనివర్సిటీ నిర్మించారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.