తెలంగాణ

మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. ఆమెకు అసలేమైంది!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే హీరో నాగార్జున- సమంత- కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆమెపై విరుచుకుపడింది. కొండాపై హీరో నాగార్జునతో పాటు కేటీఆర్ పరువు నష్టం దావా కేసులు వేశారు. దానిపై విచారణ జరుగుతోంది. ఆ గొడవ ఉండగానే పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కొండా సురేఖకు వర్గపోరు ముదిరింది. తన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి రచ్చ చేశారు కొండా సురేఖ. ఏకంగా సీఐ కుర్చిలో కూర్చుని వార్నింగ్ ఇచ్చారు. సీఐ కుర్చిలో మంత్రి కొండా సురేఖ కూర్చోవడం వివాదాస్పదమైంది.

ఈ రెండు వివాదాలు కొనసాగుతుండగానే మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోసం వేములవాడలో స్వామి వారికి నైవేద్యాన్ని ఆపేశారు అధికారులు. సోమవారం ద్వాదశి సందర్భంగా స్వామివారికి మూడు గంటలకు నైవేద్యం సమర్పించాల్సి ఉంది. కాని 30 నిమిషాలు ఆలస్యంగా రాజన్న స్వామి వారికి నివేదన సమర్పించారు రాజయ్య ఆలయ అర్చకులు.

స్వామి వారి నైవేద్యాన్ని ఆపి మరి మంత్రి కొండా సురేఖకు ప్రత్యేక పూజలు చేయించారు ఆలయ అధికారులు. మంత్రి కొండా సురేఖ, ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తులు.మంత్రి కోసం స్వామివారికి సమర్పించాల్సిన నైవేద్యం ఎలా ఆపుతారని ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి చోద్యమంటూ రాజన్న భక్తులు మండిపడుతున్నారు. మరోవైపు కొండా సురేఖ వరుసగా వివాదాల్లో చిక్కుతుండటంతో ఆమె వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం కొండా సురేఖ వివాదాల్లోకి వెళుతూ పార్టీని చిక్కుల్లోకి నెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button