తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. తాజా వాయుగుండం తీరం దాటిన రెండు రోజులకే మరో బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడింది. మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్24 నాటికి మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అక్టోబరు 22 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని.. అది వాయువ్య దిశగా కదిలి అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా మారొచ్చునని ఐఎండీ అంచనా వేసింది.
తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. శనివారం నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగామ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు విస్తాయని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్ లో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది. ఉదయం కాస్త ఎండగా ఉంటుందని.. మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని తెలిపింది. సాయంత్రానికి వాతావరణం పూర్తిగా చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.