ఆంధ్ర ప్రదేశ్

మద్యం షాపులు క్లోజ్.. మందుబాబుల పరేషాన్

సాధారణంగా మద్యం షాపులు మూసివేత ఉంటే ముందే షాపు నిర్వాహకులు అలెర్ట్ చేస్తారు. రేపు షాపులు తెరవబడదు అని బోర్డులు పెడతారు. దీంతో మందుబాబుల మరుసటి రోజుకు అవసరమైన లిక్కర్ ముందే కొని పెట్టుకుని జాగ్రత్త పడుతుంటారు. కాని ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి సమాచారం లేకుండా మద్యం షాపులు మూతపడ్డాయి. దీంతో మందుబాబులు షాకయ్యారు. లిక్కర్ దొరకక అవస్థలు పడుతున్నారు.

ఏపీలో మద్యం దుకాణాలు మూసివేశారు సూపర్‌వైజర్లు, సేల్స్ మెన్స్. ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసిస్తూ మద్యం దుకాణాలు ముసివేసినట్లు సమాచారం. గత ఐదేళ్లు ఏపీలో మద్యం షాపులను ప్రభుత్వమే రన్ చేసింది. ప్రతి వైన్ షాపులో సూపర్ వైజర్, సేల్స్ మెన్లను నియమించింది. వాళ్లే మద్యం సేల్ చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం పాత విధానం రద్దు చేసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. తెలంగాణ తరహాలో టెండర్ల ద్వారా ప్రైవేట్ వ్యాపారులకు ఇవ్వబోతోంది. మంగళవారం నోటిఫికేషన్ రావడంతో లిక్కర్ షాపుల కోసం టెండర్లు వేస్తున్నారు వ్యాపారులు. రెండు వారాల్లో కొత్త దుకాణాలు తెరుచుకోనున్నాయి.

అయితే కొత్త మద్యం పాలసీతో గత ఐదేళ్లుగా సూపర్ వైజర్లు, సేల్స్ మెన్ గా పని చేసిన దాదాపు 8 వేల మంది రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బాధితులంతా ఆందోళన చేస్తున్నారు. తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. తమ నిరసనలో భాగంగానే ఇవాళ మద్యం దుకాణాలకు రాలేదు. దీంతో షాపులు తెరుచుకోలేదు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ముసివేయటంతో ప్రైవేట్ బార్ల వద్ద బారులు తీరారు మందు బాబులు. గాంధీ జయంతి కావటంతో పబ్లిక్ హాలిడే కారణంగా బుధవారం కూడా మద్యం దుకాణాలు మూతపడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button