తెలంగాణ

బిల్లులు రాలేదని గ్రామ పంచాయతీకి మాజీ సర్పంచ్ వేలం

తెలంగాణ రాష్ట్రంలో చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్ లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లక్షల రూపాయలు సొంత ఖర్చులు పెట్టి పనులు చేస్తే బిల్లులు రాకపోవడంతో కొందరు సర్పంచ్ లు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు రోడ్డెక్కి భిక్షాటన చేశారు. తమ పదవి కాలం ముగిసినా బిల్లులు రాకపోవడంతో ఇంకా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ఓ మాజీ సర్పంచ్ తనకు రావాల్సిన బిల్లులు ఇవ్వలేదంటూ ఏకంగా గ్రామ పంచాయతీ భవనాన్ని వేలానికి పెట్టాడు.భైంసా మండలం కథ్​గాం గ్రామ మాజీ సర్పంచ్ ​ఇలా వేలానికి పెట్టి పంచాయతీ అధికారులకు చుక్కలు చూపించాడు.

గ్రామంలో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసినా నిధులు మంజూరు కాలేదని మాజీ సర్పంచ్ ​రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. త్వరగా బిల్లులైనా మంజూరు చేయాలని లేదంటే గ్రామ పంచాయతీ భవనాన్ని వేలం వేసేందుకు పర్మిషన్​అయినా ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నాడు. కథ్​​గాం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసి జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని.. కానీ రూ.60 లక్షల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని అన్నారు. మూడ్రోజుల్లో అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే గ్రామ పంచాయతీ భవనం, ట్రాక్టరును ను వేలం వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.ఇందుకు సంబంధించి వినతిపత్రాలను ముథోల్​ఎమ్మెల్యే రామారావు పటేల్, అడిషనల్ కలెక్టర్​ ఫైజాన్​ అహ్మద్, ఆర్డీవో కోమల్ రెడ్డి, ఎమ్మార్వో ప్రవీణ్​ కు అందించారు. మాజీ సర్పంచ్ లేఖ ​సోషల్ ​మీడియాలో వైరల్​ గా మారింది.

మాజీ సర్పంచ్ అధికారులకు రాసిన లేఖలో ఏముందంటే..

‘నేను ఐదేండ్లపాటు పదవిలో ఉండి మా గ్రామ పంచాయతీలో దాదాపు రూ. కోటిన్నర వరకు అభివృద్ధి పనులు చేపట్టా. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, జీపీ బిల్డింగ్​ నిర్మాణాలకు రూ. 60 లక్షల వరకు ఖర్చు చేశా. ఇందుకోసం అప్పులు చేశా. బిల్లులు పెండింగ్​లో ఉండడంతో అప్పులు తీర్చలేక రెండేండ్లుగా వడ్డీలు కడుతున్నా. ఆర్థికంగా బాగా ఇబ్బం దుల్లో ఉన్నా.. త్వరగా బిల్లులు ఇవ్వండి.. లేదంటే జీపీ భవనం, ట్రాక్టర్లను వేలం వేయాలనుకుంటున్నాం. నాకు పర్మిషన్​ ఇవ్వండి’

Back to top button