హైడ్రా కమిషనర్ రంగనాథ్, కాంగ్రెస్ బహిష్క్రత నేత బక్కా జడ్సన్ మధ్య వార్ ముదురుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్లో ఉందని బక్క జడ్సన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. దీనిపై సోషల్ మీడియాతో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బఫర్ జోన్ లో కట్టిన ఇంట్లో ఉంటున్న హైడ్రా కమిషనర్.. ఇతరుల ఇండ్లను ఎలా కూల్చివేస్తారనే విమర్శలు వస్తున్నాయి. తన నివాసం బఫర్ జోన్ లో ఉందని జరుగుతున్న ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. తాము ఉంటున్న ఇల్లు 4 దశాబ్దాల క్రితం మా నాన్న కట్టాడు.. మా ఇల్లు బఫర్ జోన్లో లేదని క్లారిటీ ఇచ్చారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన వివరణ పూర్తిగా ఇదే..
* మధురా నగర్లో మేము నివాసం వుంటున్న యిల్లు 4 దశాబ్దాల క్రితం మా నాన్నగారు నిర్మించినది.
* కృష్ణకాంత్ పార్కు దిగువున వున్న వేలాది యిళ్ళ తర్వాత మా యిల్లు ఉంది.
* మా నాన్నగారు నిర్మించిన ఈ యిల్లు బఫర్ జోన్లో వుందని కొన్ని సామాజిక మాధ్యమాల్లో పాటు పేపర్లలో వచ్చిన వార్తలో వాస్తవం లేదు.
* ఒకప్పటి పెద్ద చెరువునే రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చిన విషయం అందరికీ తెలిసిందే.
* అయినప్పటికీ చెరువు కట్టకు దిగువున10 మీటర్లు దాటితే.. కిందన వున్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావు.
* అయినప్పటికీ కట్టకు దాదాపు కిలో మీటర్ దూరంలో మేము నివాసం వుంటున్న యిల్లు వుంది.
* వాస్తవాలు యిలా వుంటే తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాన్ని ఖండిస్తున్నాను.
* వాస్తవాలు యివి
– మా నాన్న శ్రీ ఎ.పి.వి.సుబ్బయ్య గారు 1980 సంవత్సరంలో మేము వుంటున్న యింటిని నిర్మించారు.
– 44 సంవత్సరాల క్రితం నిర్మించిన అదే ఇంట్లో మా తండ్రితో కలిసి ఉంటున్నాము.
– ప్రస్తుత కృష్ణాకాంత్ పార్కు గా వున్న స్థలంలో సుమారు 25 సంవత్సరాల క్రితం ఒక చెరువు ఉండేది. చెరువున్నప్పటి నిబంధనల ప్రకారం అయినా మేము వుంటున్న నివాసం కట్టకు ఒక కిలోమీటరు దూరంలో వుంది.
– సంస్కృతి/సంప్రదాయాలలో భాగంగా చెరువు కట్ట మీద, కట్టను ఆనుకొని కట్ట మైసమ్మ ఆలయాలు నిర్మిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.
– మేము నివాసం వుంటున్న ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో కట్ట మైసమ్మ గుడి ఉంది.
– ఎక్కడైనా చెరువు కట్ట ఎత్తుపై ఆధారపడి దిగువ భాగంలో 5-10 మీటర్ల వరకు వున్న స్థలాన్ని బఫర్ జోన్ గా ఇరిగేషన్ శాఖ పరిగణిస్తుంది.
– 25 ఏళ్ల క్రితం పెద్దచెరువు.. ప్రస్తుతం కృష్ణకాంత్ పార్కుగా మారిన స్థలం మా నివాసానికి 1 కి.మీ దూరంలో ఉంది. ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను.
– మేము నివాసం వుంటున్న యిల్లు బఫర్ జోన్లో లేదు అనేది వాస్తవం అనేది అందరూ గ్రహించాలి. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా పరిశీలించాలని కోరుతున్నాను.
ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్.