తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. కేసీఆర్, కేటీఆర్ , హరీష్ రావుతో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. చిల్లరగా మాట్లాడితే అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నిర్వహించిన డిజిటల్ ఫ్యామిలీ కార్డు కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. హైడ్రాపై మరోసారి ప్రభుత్వ వైఖరి స్పష్టం చేశారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ది కోసమే మూసీ ప్రక్షాళన చేపట్టామన్నారు.
మూసీ ప్రక్షాళనలో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు అన్ని రకాలుగా సాయం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇల్లుతో పాటు తరలింపునకు ఒక్కో ఇంటికి 25 వేల రూపాయలు ఇస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. మూసీ బాధితులు పేరుతో కిరాయి మనుషులతో కేటీఆర్ డ్రామా చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బుల్డోజర్లు మాపై నుంచి వెళ్లాలంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ వాడుతున్నారంటూ సెటైర్లు వేశారు. మీలాంటోళ్ల కోసం బుల్డోజర్లు అవసరం లేదని.. పిచ్చికుక్క కరిస్తే సచ్చేటోళ్ల కోసం బుల్డోజర్లు అవసరమా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. మీ కోసం ఒక్క బుల్డోజర్ కూడా కొనేది లేదని.. అన్ని బుల్డోజర్లు ప్రభుత్వం దగ్గర లేవంటూ సెటైర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి.
మోడీకి ఊడిగం చేసే ఈటల రాజేందర్ ఏదేదో మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలపై అంత ప్రేమ ఉంటే మోడీకి చెప్పి మూసీ బాధితుల కోసం 25 వేల కోట్ల రూపాయలు తీసుకురావాలని సూచించారు. ప్రధాని మోడీ దగ్గరకు నేను కూడా వస్తానని చెప్పారు. కరీంనగర్ నుంచి మల్కాజ్ గిరికి బతకొచ్చిన ఈటల రాజేందర్ కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అందరి సంగతి చూస్తానని హెచ్చరించారు. ఏ ఒక్కడిని వదిలి పెట్టేది లేదన్నారు. పదేళ్లు కేసీఆర్ తో పనిచేసిన రాజేందర్ కు ఇంకా పాత వాసన పోలేదన్నారు. కేటీఆర్, హరీష్ రాసిచ్చిందో ఈటల చదువుతున్నారని రేవంత్ మండిపడ్డారు.