తెలంగాణ

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. తెలంగాణకు ఐఎండీ వార్నింగ్

తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పంజా విసిరాడు. గత రెండు వారాలుగా నాన్ స్టాప్‌గా వర్షాలు కురుస్తున్నాయి. జనాలు సూర్యుడిని చూడక రోజులు గడుస్తోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షం నమోదైంది. వర్ఘాల పరిస్థితి ఇలా ఉండగానే.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రెండు మూడ్రోజుల్లో వాయుగుండంగా మారి తీవ్రతరం కానుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

అయితే ఈ వాయుగుండం వాయువ్యంగా పయనిస్తూ ఉత్తర ఒడిశా, బెంగాల్‌ తీరాలకు చేరుకోనుందని తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పినట్లయింది. కాని అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 8 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. 6వ తేది శుక్రవారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. 7,8 తేదీల్లో మాత్రం మోస్తరు వర్షాలే కురవనున్నాయి.

అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో పలుచోట్ల భారీవర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముంది.

రాబోయే మూడు రోజులు సముద్రం అలజడిగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశామన్నారు.

Back to top button