తెలంగాణ

పోలీస్ పహారాలో గ్రూప్ 1 ఎగ్జామ్.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ

తెలంగాణలో జరుగుతున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షపై హై టెన్షన్‌ నెలకొంది. ఒక వైపు అభ్యర్థుల ఆందోళనలు మరోవైపు పరీక్షల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు. ఇంకోవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్న నేపథ్యంలో గ్రూప్‌- 1 పరీక్షపై ఉత్కంఠ నెలకొంది. గ్రూప్‌ -1 పరీక్షను వాయిదా వేయాలని.. జీవో నెంబర్ 29ని రద్దు చేసి ఎగ్జామ్ రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజుల గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. మరో వైపు చెప్పిన డేట్ ప్రకారం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది.

తెలంగాణలో దాదాపు 13 సవత్సరాల తర్వాత గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎగ్జామ్ జరుగుతుండటంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పకడ్బంది ఏర్పాట్లు చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎలాంటి అపోహలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఉద్దేశ పూర్వ కంగా తప్పుడు సమాచారం చేసే పోస్టులపై సైబర్ సెల్ అధికారుల గట్టి నిఘా పెట్టారు.గ్రూప్‌-1 మెయిన్స్‌ జరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ అటెనెన్స్ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 వేల 383 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ఈ నెల 27వ తేది వరకు జరగనున్నాయి. అభ్యర్థులు మధ్యాహ్నం ఒంటి గంట 30నిమిషాలకు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా అదనంగా ఒక గంట సమయాన్ని కేటాయిస్తున్నారు.పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించారు.

మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పరీక్షకు కొన్ని గంటల ముందు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండటంతో ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Back to top button