సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడ్ పల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు పుష్ప 2 హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్పను చిక్కడపల్లి పోలీసులు మూడు గంటల 35 నిమిషాలు విచారించారు. ఏసీపీ రమేష్, సీఐ రాజు నాయక్ లు పలు ప్రశ్నలు అడిగారు. దాదాపు 30 ప్రశ్నలకు పుష్ప నుంచి పోలీసులు సమాధానం రాబట్టారని తెలుస్తోంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలోనే ఈ విచారణ జరిగింది. విచారణలో భాగంగా అల్లు అర్జున్ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు.
విచారణలో భాగంగా సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు తయారు చేసిన వీడియో చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్లు అల్లు అర్జున్ ఒప్పుకున్నట్లు సమాచారం. విచారణ సమయంలో తన వాహనంలో తెచ్చుకున్న బిస్కెట్స్, డ్రైఫ్రూట్స్ తిని టీ తాగారు అల్లు అర్జున్. అలాగే విచారణ సమయంలో మూడుసార్లు వాటర్ తీసుకున్నారు. విచారణ సమయంలో పుష్ప తండ్రి అల్లు అర్వింద్ తో పాటు మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చిక్కడ్ పల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని అల్లు అర్జున్ కు పోలీసులు చెప్పారని తెలుస్తోంది.