తెలంగాణ

పిడుగుల వానతో వణికిన హైదరాబాద్.. మరో మూడు రోజులు కుండపోతే

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్థరాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.ఉరుముల శబ్దాలకు నగరవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు మూడు గంటల పాటు మెరుపులు, ఉరుములు కొనసాగాయి. భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలో జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాతబస్తీతో పాటు జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, దిల్ షుక్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. మిగితా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.

పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, మయన్మార్‌ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావంతో పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడుతాయని తెలిపారు. ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

 

Back to top button