హైడ్రా కూల్చివేతలు తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్నాయి. హైడ్రా తీరుపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీలోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కట్టడాల కూల్చివేతలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని.. పార్టీకి తీరని నష్టం జరుగుతుందనే అభిప్రాయం మెజార్టీ నేతలు వ్యక్తం చేశారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నామనే భావనలో సీనియర్ నేతలు ఉన్నారని సమాచారం.
బస్తీల జోలికి రావొద్దని హైడ్రాకు ముందే చెప్పానని.. అయినా దూకుడుగా వెళ్లడం వల్లే సమస్యలు వచ్చాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. దానం బాటలోనే మరో సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కమిషనర్ కు ఏకంగా ఆయన లేఖ రాశారు. తనకు చెప్పకుండా సంగారెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని అందులో స్పష్టం చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హైడ్రా కమిషనర్ కు వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు జగ్గారెడ్డి రాసిన లేఖలో ఏముందంటే..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, సంగారెడ్డి నియోజకవర్గంలోని అధికారులకు నా సూచన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు లోపల మాత్రమే చర్యలు చేపడుతుందని ప్రకటించారు రింగ్ రోడ్డు బయట హైడ్రా యాక్షన్ ఉండదని చెప్పారు కానీ సంగారెడ్డి నియోజకవర్గంలో హైడ్రా పేరుతో కూల్చివేతలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది నియోజకవర్గ వర్గంలోని అధికారులు అత్యుత్సాహం చూపించకండి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకండి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి నా సూచన సంగారెడ్డి నియోజకవర్గంలో ఇలాంటి కూల్చివేతలు లేకుండా చూడండి ఎందుకంటే నా నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్డుకు బయట ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం నా నియోజకవర్గంలో కూల్చివేతలు ఉండకూడదు.ఒకవేళ నా నియోజకవర్గంలో ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ముందుగా నా దృష్టికి తీసుకురండి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తో మాట్లాడతా. నా నియోజకవర్గ ప్రజలను భయాందోళనలకు గురి చేసే ప్రయత్నం చేయకండి.
తూర్పు జగ్గారెడ్డి
మాజీ ఎమ్మెల్యే
సంగారెడ్డి