జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. చార్జింగ్ పెట్టగా ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారిగా పేలిపోయింది. పూర్తిగా కాలిపోయింది. కొన్న నెల రోజులకే ఎలక్ట్రిక్ బైక్ పేలిన ఘటన జగిత్యాల రూరల్ మండలం బాలపెల్లి గ్రామంలో జరిగింది. బాలపెల్లికి చెందిన బెతి తిరుపతి రెడ్డి నెల రోజుల క్రితం ఎలక్ట్రిక్ బైక్ కొన్నాడు. ఛార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాలలోనే బైక్ పేలిపోయింది.
బ్యాటరీ చార్జింగ్ 30 శాతం ఉన్నా.. ఛార్జింగ్ పెట్టామని బాధితులు చెబుతున్నారు. ఛార్జింగ్ పెట్టిన కేవలం ఐదు నిమిషాలలోనే బైక్ పేలిపోయింది. కొనుగోలు చేసి 40 రోజులు కాకముందే బైక్ పేలడంపై బాధితుడు బెతి తిరుపతి రెడ్డి, కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేశారు. బైక్ డిక్కీలోనే వరి ధాన్యం డబ్బులు లక్షా 90 వేల రూపాయలు ఉన్నట్టు బాధితుడు తిరుపతి రెడ్డి వాపోయారు.
తెలంగాణ ప్రజలు ఈవీ వాహనాలను వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని.. హైదరాబాద్, తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చామని మంత్రి వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా వాడేలా ఈ పాలసీ ఉందన్నారు. ఈవీ వాహనాలపై రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి 100 శాతం మినహాయింపు ఇస్తున్నామని పొన్నం తెలిపారు. అయితే ప్రజలు ఈవీ వాహనాల వైపు చూస్తున్నా.. పేలిపోతున్న ఘటనలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.