క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిది : వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తెలంగాణలో భారీ వర్షం పడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. నల్గొండ జిల్లా గత రికార్డులన్ని బద్దలవుతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, చిల్కూరులో కేవలం 6 గంటల్లోనే ఏకంగా 250 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. గత ఏడాది వరంగల్ జిల్లా నెక్కెండలో 24 గంటల్లోనే 300 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కాని ఈసారి హుజూర్ నగర్, చిల్కూరులో కేవలం 6 గంటల్లోనే 250 మిల్లిమీటర్ల వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది.
సూర్యాపేట జిల్లాలో శనివారం ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. హుజూర్ నగర్, చిల్కూరు, కోదాడ, మఠంపల్లి, అనంతగిరి . నాగారం మండలాల్లో కుండపోతగా వర్షం కురిసింది. భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండిపోయాయి. నల్గొండ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ మల్లెపల్లి, దేవరకొండ, చందంపేట, హాలియ, చండూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. మిగితా ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.
Read More : హైదరాబాద్‌లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు
మరో మూడు రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో మూడు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయి సిబ్బందిని అలర్ట్ చేశారు. అధికారులంతా ఫీల్డ్ లోనే ఉండాలని ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్ధితి వచ్చినా ఎదుర్కోవడానికి సిబ్బందిని సిద్దం చేశారు అధికారులు. స్కూళ్లకు సోమవారం సెలవు ప్రకటించే యోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు.