నల్గొండ జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ అత్యవరసరంగా ల్యాండ్ కావడం సంచలనం రేపింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా చిట్యాల మండలంవనిపాకల వద్ద పొలాల్లో ల్యాండ్ అయింది. తమ పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో స్థానికులంతా ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందోనని టెన్షన్ పడ్డారు. అయితే సాంకేతిక సమస్య రావడంతో హెలికాప్టర్ ను పొలంలో పైలెట్ ల్యాండ్ చేసినట్లు తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
కుండపోత వర్షాలతో విజయవాడ జలమయమైంది. లక్షలాది మంది వరదల్లో చిక్కుకున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. మూడు రోజుల పాటు వరద ప్రాంతాల్లో సేవలు అందించింది హెలికాప్టర్. వరద ప్రాంత ప్రజలకు పాలు, వాటర్, ఫుడ్ ను హెలికాప్టర్ల ద్వారానే అందించారు.
వరద తగ్గడంతో హెలికాప్టర్ తో సంబంధం లేకుండానే ఇప్పుడు విజయవాడలో సహాయ చర్యలు సాగుతున్నాయి. దీంతో ఆర్మీ హెలికాప్టర్ తిరిగి జైపూర్ వెళుతోంది. ఈ సమయంలోనే సాంకేతిక లోపం తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలెట్ అత్యవసరంగా పొలాల్లో ల్యాండ్ చేశారు. ఆర్మీ హెలికాప్టర్ ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సమస్య పరిష్కరించేందుకు టెక్నికల్ బృందంతో మరో హెలికాప్టర్ అక్కడకు చేరుకుంది. సాంకేతిక సమస్యను పరిష్కరించాకా రెండు హెలికాప్టర్లు పొలం నుంచి టేకాఫ్ అయ్యాయి.