తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. జనవరి చివరికి కొత్త చీఫ్ ను ప్రకటిస్తామని బీజేపీ హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. కొత్త చీఫ్ ఎంపికపై కసరత్తు కూడా పూర్తి చేసింది. రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలతో సంప్రదింపులు కూడా జరిపింది. కొత్త చీఫ్ రేసులో ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, రఘునందన్ రావుతో పాటు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్లు వినిపించాయి. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు కూడా ఢిల్లీలో లాబియింగ్ చేశారనే వార్తలు వచ్చాయి.
బీసీ నినాదంతో తెలంగాణలో ముందుకు వెళ్లాలని భావిస్తున్న కమలనాధులు.. బీసీ నేతకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే చర్చ సాగింది. బీసీ కోటాలో బండి సంజయ్, అర్వింద్, ఈటల పేర్లు వినిపించాయి. అయితే కేంద్రమంత్రిగా ఉన్న తాను టీబీజేపీ రేసులో లేనని బండి సంజయ్ ప్రకటించారు. దీంతో ఎంపీలు ఈటల, అర్వింద్ లో ఒకరికే రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇస్తారనే టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో కొత్త వచ్చిన వారికి అవకాశం ఇవ్వకపోవచ్చనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో ఈటలకు పార్టీ పగ్గాలు ఇవ్వరేమో అన్న వార్తలు వస్తున్నాయి.
తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్‌ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదన్నారు. బీజేపీ క్రియా శీలక సభ్యత్వం ఉంటే చాలు అని కిషన్‌రెడ్డి తెలిపారు. రెండు సార్లు బీజేపీ గుర్తు పై పోటీ చేసినా సరిపోతుందని అన్నారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.