తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని అలెర్ట్ ఇచ్చింది. ఉత్తర తమిళనాడు తీరప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని చెప్పారు. మరో ఆవర్తనం అండమాన్ సమీపంలో సగటున సముద్రమట్టానికి రూ.5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఈ నెల 24న అది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని అన్నారు.
ఆదివారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. సోమ, మంగళవారాల్లోనూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉంది. వర్షంతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ఉదయం వాతావరణం మేఘావృతమై.. మధ్యాహ్నానికి కాస్త ఉష్టోగ్రతలు పెరుగుతాయన్నారు. సాయంత్రం తర్వాత వాతావరణం పూర్తిగా చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. డ్యాం 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు లక్షా 72 వేల 712 క్యూసెకుల వరద వస్తుండగా లక్షా 89 వేల 312 క్యూసెకులు వరదను దిగువకు వదులుతున్నారు.