తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు చాలా ప్రాంతాల్లో పొగ మంచు కప్పేస్తోంది. పొగమంచు కారణంగా రహదారులపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో గరిష్టంగా గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోతున్నాయి. ఇక హైదరాబద్ శివారు ప్రాంతాల్లోనూ చలి పులి పంజా విసురుతోంది. కొన్ని ఏరియాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు పగటి పూట ఉష్ణోగ్రత గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాత్రివేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.