ఆంధ్ర ప్రదేశ్

తీరానికి దూసుకొస్తున్న తుఫాన్.. కోస్తాంధ్రలో హై అలెర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను తీరం వైపు దూసుకువస్తోంది. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, తుఫానుగా మారి, తీవ్ర తుపానుగా మారే అవకాశం వుందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర తుపాను ‘దానా’ ముప్పు పొంచి ఉండటంతో ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను భారత వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. అల్పపీడనం నేటి ఉదయం తుపానుగా, రేపు తెల్లవారుజామున తీవ్ర తుపానుగా రూపాంతరం చెందొచ్చని ఐఎండీ పేర్కొంది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం లోగా ఒడిశాలోని పూరీ , పశ్చిమ బెంగాల్‌ లోని సాగర్‌ ద్వీపం మధ్యలో తీరం దాటొచ్చని వాతావరణశాఖ అధికారులు భావిస్తున్నారు.

తీరం దాటే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురు గాలుల తీవ్రత 140 నుంచి 160 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని.. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఈ దానా తుపాను తీరం తాకుతుందని వివరించింది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నేటి నుంచి నాలుగు రోజులపాటు పశ్చిమ బెంగాల్‌లో.. ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఒడిశాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.తుపాను ప్రభావం ఏపీపై ఉండకపోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం ఒడిశా, పశ్చిమబెంగాల్, స్థానిక పరిస్థితుల వల్ల గమనం మార్చుకుంటే బంగ్లాదేశ్‌ వైపు వెళ్ళే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దానా తుపాను హెచ్చరికల నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్లలో ఎక్కువగా హావ్‌డా, భువనేశ్వర్, ఖరగ్‌పూర్, పూరీ తదితర ప్రాంతాలనుంచి రాకపోకలు సాగించేవి ఉన్నాయి. విశాఖ-భువనేశ్వర్‌ మధ్య రాకపోకలు సాగించే వందేభారత్‌ రైలును 24న రద్దు చేశారు.

Back to top button