తెలంగాణ

తీన్మార్ మల్లన్నపై రేవంత్ గురి.. ఆర్ కృష్ణయ్యతో స్కెచ్!

బీసీ నినాదంలో జనంలోకి వెళుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్రేజ్ బడుగు,బలహీన వర్గాల్లో భారీగా పెరిగిపోతోంది. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న బీసీల కోసం నిక్కచ్చిగా పోరాడుతున్నారనే చర్చ జనాల్లో సాగుతోంది. అదే సమయంలో రోజురోజుకు దూకుడు పెంచుతున్నారు తీన్మార్ మల్లన్న. మంత్రులను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి మంత్రులను బహిరంగంగానే కడిగిపారేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని వదలడం లేదు తీన్మార్ మల్లన్న. బీసీల హక్కుల సాధన కోసం పదువులు కూడా వదులుకుంటానని చెబుతున్నారు.

తీన్మార్ మల్లన్న తీరు అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఆదివారం మిర్యాలగూడ బీసీ సభలో మాట్లాడిన తీన్మార్ మల్లన్న.. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు సీనియర్ నేత జానారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరు రెడ్డి కుటుంబాల సంగతి తేలుస్తానని ప్రకటించారు. తనకు రెడ్ల ఓట్లు అవసరం లేదని సవాల్ చేశారు. రెడ్డి లీడర్లు కూడా తమకు బీసీల ఓట్లు అవసరం లేదని చెప్పే దమ్ముందా అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. కాంట్రాక్టులతో అడ్డగోలుగా దోచుకుంటున్నారని కోమటిరెడ్డి బ్రదర్స్ ను టార్గెట్ చేశారు. పందికొక్కుల్లా ప్రజా ధనం లూటీ చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్జిని ఉద్దేశించి కామెంట్ చేశారు. జానారెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఏం చేశారని ఆయన కుటుంబంలో రెండు పదవులు ఇచ్చారని నిలదీశారు తీన్మార్ మల్లన్న.

తీన్మార్ మల్లన్న రోజురోజుకు వాయిస్ పెంచుతుండటంతో మంత్రులంతా ఆయనపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మల్లన్న తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ యాక్షన్ మొదలు పెట్టారని తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న వైపు బీసీ నేతలెవరు వెళ్లకుండా మంత్రులకు టాస్క్ అప్పగించారని సమాచారం. దీంతో రంగంలోకి దిగిన మంత్రులు తీన్మార్ మల్లన్నతో పాటు సమావేశాలకు వెళ్లకుండా ఆర్ కృష్ణయ్యను ఆపేశారని తెలుస్తోంది. ఆదివారం జరిగిన మిర్యాలగూడ బీసీ సమావేశానికి తీన్మార్ మల్లన్నతో పాటు కృష్ణయ్య వెళ్లాల్సి ఉంది. కాని మంత్రులు ఆయనను వెళ్లకుండా ఆపేశారని టాక్.

అంతేకాదు ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ లు ఆర్ కృష్ణయ్యను సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తీసుకెళ్లారు. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు చెప్పారు ఆర్ కృష్ణయ్య. అయితే కమిషన్ విషయంలో కాకుండా తీన్మార్ మల్లన్నను ఒంటరి చేసే వ్యూహంలో భాగంగానే కృష్ణయ్యను సీఎం రేవంత్ రెడ్డి పిలుపించుకున్నారని చెబుతున్నారు.మరో బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ను కులగణన అవగాహన సదస్సుల పేరుతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు మంత్రులు. ఇదంతా తీన్మార్ మల్లన్నను ఏకాకి చేసేందుకు అన్న టాక్ నడుస్తోంది.

బీసీల కోసం గట్టిగా పోరాడుతున్న తీన్మార్ మల్లన్న లేకుండా సీఎం రేవంత్ రెడ్డి బీసీ నేతలతో సమావేశం కావడంపైనా కాంగ్రెస్ చర్చ సాగుతోంది. తీన్మార్ మల్లన్నను అవమానించే వ్యూహంలో భాగంగానే బీసీల సమావేశానికి ఆయనను పిలవడం లేదని తెలుస్తోంది. పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు, సీఎం రేవంత్ రెడ్డి కుట్రలను పసిగట్టిన తీన్మార్ మల్లన్న.. తాను కూడా ఎక్కడా తగ్గకూడదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యే మంత్రులపై విరుచుకుపడుతున్నారని ఆయన అనుచరులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button