తెలంగాణ

తీన్మార్ మల్లన్నకు చెక్.. బీసీలను చీల్చిన సీఎం రేవంత్!

కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న కొన్ని రోజులుగా వాయిస్ మార్చారు. బీసీ గళం వినిపిస్తూ జనంలోకి వెళుతున్నారు. బీసీ ఎజెండాగానే రాజకీయం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న ప్రసంగాలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేలా ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. తనకు బీసీ ఓట్లు చాలు.. రెడ్డీలు తనకు ఓటు వేయాల్సిన అవసరమే లేదన్నారు. తీన్మార్ మల్లన్న తీరుపై సీఎం రేవంత్ వర్గం గుర్రుగా ఉంది. సోషల్ మీడియా వేదికగా ఫైరవుతున్నారు.

తీన్మార్ మల్లన్న తీరుపై అసహనంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అతనికి చెక్ పెట్టేలా స్కెచ్ వేశారని తెలుస్తోంది. తాజాగా బీసీ సంఘం నేతలు, బీసీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం నేతలు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ‌లో బీసీ సామాజిక‌, ఆర్థిక, కుల స‌ర్వే ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌న్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసిన నేతలు.అయితే బీసీల సమావేశంలో బీసీ గళం వినిపిస్తున్న తీన్మార్ మల్లన్న లేకపోవడం చర్చగా మారింది. తీన్మార్ మల్లన్నకు కనీసం ఆహ్వానం కూడా లేదంటున్నారు. మల్లన్నను కావాలనే పిలవలేదని చెబుతున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో మరో కీలక అంశం కనిపించింది. బీసీల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న ఆర్ కృష్ణయ్యను కాకుండా మరో సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఇది కూడా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యను ఇటీవల తీన్మార్ మల్లన్న కలిశారు. బీసీల కోసం కలిసి పోరాడాలని నిర్ణయించారు. ఆర్ కృష్ణయ్యను ఆకాశానికెత్తిన తీన్మార్ మల్లన్న.. బీసీల కోసం ఎంతవరకైనా పోరాడుతామని చెప్పారు. ఇది కూడా సీఎం రేవంత్‌కు నచ్చలేదన్నారు. అందుకే తీన్మార్ మల్లన్నను కలిసిన ఆర్ కృష్ణయ్యను పిలవకుండా.. అతనికి వ్యతిరేకంగా సంఘం పెట్టిన జాజుల శ్రీనివాస్ గౌడ్‌ను పిలిచారంటున్నారు. తీన్మార్ మల్లన్నను అవమానించాలనే ఇలా ప్లాన్ చేశారంటున్నారు.

బీసీల సమావేశానికి తనను పిలవకపోవడంపై తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. తనను టార్గెట్ చేయడానికే ఇలా ప్లాన్ చేశారంటున్న మల్లన్న.. సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటానని అనుచరులతో చెప్పారని సమాచారం. మొత్తం సీఎం రేవంత్ రెడ్డితో బీసీ నేతల సమావేశం కాంగ్రెస్ లో కొత్త వివాదానికి కారణమైందని చెబుతున్నారు. తీన్మార్ మల్లన్న భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button