తిరుమల అన్నదాన సత్రంలో వడ్డించిన పెరుగన్నంలో జెర్రీ వచ్చిందన్న వార్త సంచలనంగా మారింది. తిరుమల లడ్డూ కల్తీపై వివాదం సాగుతుండగానే.. ప్రసాదంలో జెర్రీ కనిపించడంతో వెంకన్న భక్తులు పరేషాన్ అయ్యారు. తిరుమలలో అసలేం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగన్నంలో జెర్రీ వచ్చిందన్న వార్త సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. టీటీడీపై జనాలు దుమ్మేత్తిపోస్తున్నారు. దీంతో పెరుగన్నంలో జెర్రీ వార్తలపై వివరణ ఇచ్చింది టీటీడీ
అన్న ప్రసాదంలో జెర్రీ పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారమని టీటీడీ తెలిపింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదములో తాము తిన్న అన్నప్రసాదంలో జర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవదూరమని వెల్లడించంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాదిమంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టిటిడి వారు అన్నప్రసాదాలను తయారుచేస్తారు.. అంత వేడిలో ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రీ ఉందని సదరు భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరమని టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాత పెరుగు కలుపుతారు.. అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జర్రి ఉండటం అనేది ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య మాత్రమే గా భావించాల్సి వస్తుందని టీటీడీ తెలిపింది.
దయచేసి భక్తులు ఇటువంటి సత్యదూర వార్తలను నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ ప్రకటనతో జెర్రీ వచ్చింది నిజమా కాదా.. రాకుంటే అలా ప్రచారం చేసిందెవరో నిగ్గు తేల్చాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.