విజయవాడ మునిగిపోవడానికి కారణం మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లనే విజయవాడ నగరం విలవిల్లాడుతోందన్న ఆయన.. గతంలో ఎన్నడూ ఇంత విపత్తు చూడలేదని స్పష్టం చేశారు. వరద బాధితులనూ ఆదుకోవడం లేదని, వారికి కనీసం మంచినీరు కూడా సరఫరా చేయడం లేదని, రిలీఫ్ క్యాంప్స్ లేవని, ఇంకా ఎలాంటి సహాయక చర్యలూ లేవని అన్నారు. వరద బాధితులకు రెండు రోజులుగా కనీసం ఆహారం కూడా అందడం లేదని, వారిని తరలించేందుకు తగిన సంఖ్యలో బోట్లు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. నిజంగా ఇంత దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఇంతకు ముందు ఇప్పటికన్నా ఎక్కువ వర్షాలు కురిశాయని, కానీ ఏరోజూ ప్రజలు ఈ స్థాయిలో బాధ పడలేదని గుర్తు చేశారు.
బంగాళాఖాతంలో అల్పపీడనంపై గత నెల 28న ఐఎండీ నుంచి ప్రభుత్వానికి వార్నింగ్ అందిందని జగన్ చెప్పారు. 20 సెంమీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పినా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోలేదని ఆరోపించారు. కనీసం సమీక్ష కూడా జరపలేదని గుర్తు చేశారు. దిగువ ప్రాంతాలే కాకుండా, ఎగువన తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, అందువల్ల కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యే వీలుందని కూడా సమాచారం అందినా..కూటమి ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని ఆక్షేపించారు. ఎగువన ప్రాజెక్టులు పూర్తిగా నిండిన నేపథ్యంలో, నీరు విడుదల చేస్తే ఏం చేయాలన్న దానిపై ఏ మాత్రం ఆలోచన చేయలేదని జగన్ ప్రస్తావించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి కనీసం 60–70 టీఎంసీల నీటిని తగ్గించి, అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలని గుర్తు చేశారు. కానీ ఆ పని చేయకపోవడం వల్ల కృష్ణా నదిలో వరద పోటెత్తడంతో, ఏకంగా 1.70 లక్షల క్యూసెక్కుల నీటి వరద వచ్చిందని.. దీనిపైనా కేంద్ర జల సంఘం సమాచారం ఇచ్చిందని తెలిపారు.
వాటర్ కుషన్ ఏర్పాటు చేసి 30వ తేదీ నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చి ఉంటే, ఇక్కడ వరద 8 లక్షల నుంచి 9 లక్షల క్యూసెక్స్‌కే పరిమితం అయ్యేదని జగన్ వెల్లడించారు. కానీ, కూటమి ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం వల్ల ఏకంగా 11.35 లక్షల క్యూసెక్స్ వరద వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం పరిపాలన పూర్తిగా గాలికి వదిలి, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, తమ పార్టీపై కక్ష సాధింపు చర్యలతోనే కాలం వెళ్లదీస్తోందని ఆక్షేపించారు.
బుడమేరులో వరద పోటెత్తడంతో, కనీసం అలారం కూడా ఇవ్వకుండా శనివారం అర్ధరాత్రి 11 లాక్‌లు ఎత్తేశారని, దీంతో నీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తిందని జగన్ తెలిపారు. ఇంత కంటే దారుణం మరొకటి ఉండదన్న ఆయన.. కేవలం చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట అక్రమ కట్టడాన్ని కాపాడుకోవడం కోసమే ఆ పని చేశారని అన్నారు. తన ఇంటిని కాపాడుకోవడం కోసం విజయవాడ నగరాన్ని నీటిమయం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. నిజానికి 11.30 లక్షల క్యూసెక్స్ వరద ఇప్పుడు కొత్త కాదన్న జగన్.. 1903లో 11.90 లక్షలు, 2009లో 11.10 లక్షల క్యూసెక్స్ వరద వచ్చిందని వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో కూడా 2019 నుంచి వరసగా మూడేళ్లు ఇలాంటి వర్షపాతం నమోదైనా.. ఈ స్థాయిలో 11 లక్షల క్యూసెక్స్‌కు పైగా వరదనీరు రావడం, ప్రజలు ఇన్ని బాధలు పడడం జరగలేదని చెప్పారు. ఇందుకు కారణం పక్కాడా ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవడం, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమేనని స్పష్టం చేశారు.
విజయవాడ నగరంలో కొన్ని చోట్ల దాదాపు నడుంలోతు నీళ్లలో సైతం స్వయంగా నడిచిన జగన్, వరద బాధితులను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. వారి కష్టాలు, వారికి అందిన సాయాన్ని ఆరా తీశారు. తిండి, నీరు లేక రెండు రోజులుగా తాము నానా ఇబ్బంది పడుతున్నా, కనీసం పట్టించుకున్న వారు లేరని, ఎక్కడికైనా వెళ్లిపోదామంటే, కనీసం బోట్లు కూడా ఏర్పాటు చేయలేదని విజయవాడ నగర బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. వారి బాధలు విన్న జగన్ వారికి ఓదార్పునిచ్చారు.