
ఢిల్లీ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. గవర్నర్ ప్రసంగిస్తుండగా… ఆప్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా గందరగోళంగానే సాగాయి. సభ ప్రారంభం కాగానే… లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగం ప్రారంభించారు. వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్ ఫొటోలను తొలగించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ… గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. స్పీకర్ విజేందర్ గుప్తా… వారిని వారించారు. ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని…. సభకు గౌరవం ఇవ్వాలని కోరారు. కానీ… ఆప్ ఎమ్మెల్యేలు నిరసన కొనసాగించారు. దీంతో… మాజీ సీఎం అతిశీతోపాటు 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఒక రోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్.
సస్పెండ్ అయిన ఆప్ ఎమ్మెల్యేలు… అసెంబ్లీ ప్రాంగణంలోనే ధర్నాకు దిగారు. సీఎం కార్యాలయం నుంచి బీఆర్ అంబేద్కర్ ఫొటోను తొలగించడం ద్వారా… బీజేపీ… రాజ్యాంగ నిర్మాతను అగౌరవపరిచిందని అతిశీ ఆరోపించారు. అంబేద్కర్ స్థానంలోకి మోడీ రావాలనుకుంటున్నారా…? అని ప్రశ్నించారు ఆప్ ఎమ్మెల్యేలు. అంబేద్కర్ ఫొటోను ఉండాల్సిన స్థానంలో ఉంచే వరకు తాము నిరసన తెలుపుతూనే ఉంటామన్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు.
మరోవైపు… లిక్కర్ స్కామ్‌పై కాగ్ నివేదిక అంశాన్ని పక్కదారి పట్టిచేందుకే ఆప్ ఎమ్మెల్యేలు రాద్దాంతం చేస్తున్నారని అధికార పక్ష ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. సీఎం కార్యాలయంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, భగత్‌సింగ్, ప్రధాని చిత్రపటాలు అలాగే ఉన్నాయంటూ ఒక ఫొటోను కూడా విడుదల చేశారు.