
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం(ఎస్‌ఎల్‌బీసీ) పనుల కొనసాగింపులో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. డ్రిల్లింగ్–బ్లాస్టింగ్(డీబీఎం) పద్ధతిలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు చేయాలని భావిస్తోంది. టన్నెల్ బోరింగ్ మెషన్(టీబీఎం) పద్ధతిలో పనులు చేయలేమని నిర్మాణ సంస్థ తేల్చి చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అయితే బ్లాస్టింగ్, డ్రిల్లింగ్ పనులకు అటవీ శాఖ, పర్యావరణ శాఖ అనుమతులు ఇస్తుందా.. లేదా అనే అనుమానాలను రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం(ఎస్‌ఎల్‌బీసీ) పనులను టీబీఎం ద్వారా చేయలేమని నిర్మాణ సంస్థ తేల్చి చెప్పడంతో, డీబీఎం ద్వారా పనులు కొనసాగించేందుకు అంగీకరించింది ప్రభుత్వం.డీబీఎం కంటే టీబీఎం పద్ధతికి 4-5 రెట్లు ఖర్చు ఎక్కువ అవుతుందని, కానీ టీబీఎం పద్ధతిలో తవ్వకానికి ఇచ్చిన వ్యయాన్నే డీబీఎం పద్ధతిలో తవ్వేందుకు ఇవ్వాలని కోరింది నిర్మాణ సంస్థ.
ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్నెల్ కూలిపోవడంతో, ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం.అయితే టీబీఎం పద్ధతిలో చేయలేమని, డీబీఎం పద్ధతిలో మిగతా పనులు చేసేందుకు రూ.2,486 కోట్లు అవసరమని నిర్మాణ సంస్థ చేసిన ప్రతిపాదనలకు అంగీకరించింది రాష్ట్ర నీటిపారాదుల శాఖ. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ లాంటి పనులు చేయాలంటే అటవీశాఖ, పర్యావరణ శాఖతో అనేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలుపుతున్నారు విశ్రాంత ఇంజనీర్లు. మరోవైపు ప్రమాదంలో చిక్కుకున్న మృతదేహాలు బయటికి తీయకుండా, పనిచేసేందుకు కార్మికులు ఎలా ఆసక్తి చూపిస్తారంటూ నిర్మాణ సంస్థను నిలదీస్తున్నారు కార్మికులు